Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన
ఇస్లామాబాద్ : ప్రస్తుత పరిస్థితుల్లో భారత్తో ఏ రకమైన వాణిజ్యం చేయరాదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. భారత్ నుండి పత్తి, చక్కెర దిగుమతిపై తన కేబినెట్ మంత్రులతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియా వార్తలు శనివారం తెలిపాయి. కాశ్మీర్ సమస్యపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నందున భారత్ నుండి దిగుమతులపై దాదాపు రెండేళ్ళుగా నిషేధం అమల్లో వుంది. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ భారత్ నుంచి పత్తి, చక్కెరను దిగుమతి చేసుకోవాలని ఆర్థిక మంత్రి హమద్ అజర్ నేతృత్వంలోని ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) సిఫారసు చేసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ గురువారం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైన వస్తువుల దిగుమతి కోసం ప్రత్యామ్నాయంగా, చవకగా దొరికే వనరులను కనుగొనేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా శుక్రవారం ప్రధాని వాణిజ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఆర్థిక సమన్వయ కమిటీకి వివిధ రకాల ప్రతిపాదనలను సమర్పించారు. వాటిని ఆర్థిక, వాణిజ్య కోణంలో పరిశీలించి ఇసిసి సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత తుది ఆమోదం నిమిత్తం వాటిని కేబిటనెట్కు సమర్పిస్తారని ఆ వార్తలు తెలిపాయి. తొలుత క్యాబినెట్ సమావేశం ఎజెండాలో ఈ నిర్ణయంపై చర్చ లేనప్పటికీ మంత్రులు ప్రస్తావన తీసుకువచ్చారు. దానిపై ప్రధాని స్పందిస్తూ, ఈసీసీ నిర్ణయాన్ని వాయిదా వేసి, తక్షణమే సమీక్షించాలని ఆదేశించినట్లు మీడియా వార్తలు తెలిపాయి.
పాక్ దే బాధ్యత : భారత్
పొరుగు దేశంతో సాధారణ సంబంధాలు వుండాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని, అయితే ఎలాంటి ఉద్రిక్తతలు, భయాందోళనలు, ఘర్షణలు లేని వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పాకిస్తాన్దేనని భారత్ స్పష్టం చేసింది. చర్చలు, తీవ్రవాదం కలిసి ముందుకు సాగలేవని వ్యాఖ్యానించింది. గతేడాది మేలో కొవిడ్ నేపథ్యంలో భారత్ నుంచి మందులు, ఔషధాలకు సంబంధించిన ముడి సరుకులు దిగుమతి చేసుకోవడంపై గల నిషేధాన్ని పాక్ ఎత్తివేసింది.