Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో 'ఉపా' చట్టం కింద పెరిగిన అరెస్టులు :
- అమెరికా విదేశాంగశాఖ నివేదిక
వాషింగ్టన్ : 'చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' (యూఏపీఏ లేదా ఉపా)లోని వివిధ నిబంధనల కింద భారత్‌లో అరెస్టులు, జైలు నిర్బంధాలు పెరిగాయని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో వెల్లడించింది. 2020 ఏడాదికి సంబంధించి వివిధ దేశాల్లో మానవ హక్కులపై రూపొందించిన నివేదికలో పై అంశాన్ని అమెరికా పేర్కొంది. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) చట్టంలోని వివిధ సెక్షన్లు, అరెస్టు పద్ధతులు, నిందితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఈ నివేదికలో ప్రస్తావించారు. విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉన్న ఒక మహిళ గర్భవతి అని తెలిసినా, ఆమె పట్ల ఢిల్లీ పోలీసులు అత్యంత నిర్దయగా వ్యవహరిస్తూ అరెస్టు చేశారని, కోర్టు బెయిల్ మంజూరు చేశాకే ఆమె విడుదలయ్యారని నివేదికలో తెలిపారు. వయస్సులో పెద్దవాళ్లయిన పౌర హక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, స్టాన్ స్వామీలను వివిధ రకాల ఆరోపణలతో ఉపా చట్టం కింద అరెస్టయి జైల్లో ఉన్న సంగతి కూడా నివేదిక ప్రస్తావించింది. వయస్సురీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలతో వారు బాధపడుతున్నా, వారిని జైలు నుంచి విడుదల చేయటం లేదని నివేదిక తెలిపింది.
''ఉపా చట్టం కింద అరెస్టు అయితే, ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ నమోదుచేయకుండా నిందితుల్ని 180 రోజులపాటు నిర్బంధించే అవకాశముంది. తీవ్రవాదం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు... ఆరోపణలతో అరెస్టు అయ్యే విదేశీయులకు బెయిల్ కూడా రాదు. అక్రమంగా ఆయుధాలు కలిగివున్నాడనీ, పేలుడు పదా ర్థాలు కలిగివున్నాడని, నేరపూరిత ఘటనతో సంబంధముందని వేలి ముద్ర సాక్ష్యం లభిస్తే..నిందితుడ్ని కోర్టు దోషిగా తేల్చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం ఉపా చట్టం కింద నమోదైన 5,102 కేసుల విచారణ పెండింగ్ లో ఉంది'' అని అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో ప్రస్తావించింది. ఢిల్లీ అల్లర్లతో సంబంధముందని ఒక విద్యార్థి సంఘం నాయకురాల్ని పోలీసులు అరెస్టు చేశారనీ, ఆమె గర్భవతి అని తెలిసినా జైలులో కొన్ని నెలలపాటు నిర్బంధించారని నివేదిక పేర్కొంది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరుచేసిందని నివేదికలో తెలిపారు.