Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'దస్సాల్ట్' నుంచి కోట్ల రూపాయల్లో లంచం..
- సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఫ్రెంచ్ అవినీతి నిరోధక ఏజెన్సీ ఆడిటింగ్
- అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో నిందితుడు గుప్తానే దళారీ
- ఫ్రాన్స్ న్యూస్ వెబ్సైట్ 'మీడియాపార్ట్' వార్తా కథనం
పారిస్ : మోడీ సర్కార్-దస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీకి మధ్య కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మరో బాంబులాంటి వార్త బయటకొచ్చింది. ఒప్పందం కోసం డస్సాల్ట్ (రాఫెల్ యుద్ధ విమానాలు తయారీ సంస్థ) కంపెనీ భారత్‌లోని మధ్యవర్తులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందజేసిందని 'ఫ్రెంచ్ అవినీతి నిరోధక ఏజెన్సీ' తేల్చి చెప్పింది. రాఫెల్
ఒప్పందానికి సంబంధించి డస్సాల్ట్ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని కీలక పత్రాలపై డస్సాల్ట్ కంపెనీ వివరణ ఇవ్వడానికి నిరాకరించిందని ఫ్రెంచ్ అవినీతి నిరోధక ఏజెన్సీ తన నివేదికలో తెలిపింది. ఈ విషయాల్ని పారిస్‌కు చెందిన పరిశోధనాత్మక న్యూస్ వెబ్సైట్ 'మీడియా పార్ట్' వెల్లడించింది.
ఫ్రెంచ్ అవినీతి నిరోధక ఏజెన్సీకి చెందిన అధికారులు 2017నాటి రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు. భారత్‌కు చెందిన ఒక మధ్యవర్తికి 1 మిలియన్ యూరోలు (సుమారుగా రూ.8.62 కోట్లు) ముడుపులు అందజేశారని ఫ్రెంచ్ అధికారులు గుర్తించారు. దీనిని దాచిపెట్టడానికి దస్సాల్ట్ ఒక 'బోగస్ కొనుగోలు' పత్రాన్ని సృష్టించింది. బోగస్ కొనుగోలు పేరుతో భారత్‌లోని మధ్యవర్తికి నగదు మొత్తం పంపారు. ఈ విషయాన్ని దస్సాల్ట్ తన రికార్డులో రహస్యంగా దాస్తోందని తేలింది.
అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో (సీబీఐ విచారిస్తోంది) నిందితుడిగా ఉన్న ఏజెంట్ సుషేన్ గుప్తానే ఆ మధ్యవర్తి అని ఫ్రెంచ్ అవినీతి నిరోధక అధికారులు భావిస్తున్నారు. ఈయనకు భారత్ రక్షణ కంపెనీలకు సంబంధాలున్నాయని ఫ్రెంచ్ అధికారులు నమ్ముతున్నారు. ఈనేపథ్యంలో రాఫెల్ ఒప్పందం, ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణ జరిపితేగానీ మరిన్ని విషయాలు బయటకురావు. అయితే చట్టపరమైన చర్యలు, పూర్తిస్థాయి విచారణకు ఫ్రెంచ్ అవినీతి నిరోధక ఏజెన్సీ సిఫారసు చేయలేదు.
ఏఎఫ్ఏ ...ఏంటా కథ ?
ఫ్రెంచ్ అవినీతి నిరోదక ఏజెన్సీ (ఏఎఫ్ఏ)ని 2017లో ఏర్పాటుచేశారు. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం ఆ దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఏఎఫ్ఏ ఆడిటింగ్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాలు తయారుచేసి అమ్మే 'దస్సాల్ట్ గ్రూప్' ఆర్థిక లావాదేవీలపైనా ఆడిటింగ్ జరిగింది. అవినీతి నిరోధక నిబంధనలు కంపెనీ పాటిస్తుందా? లేదా ? అన్నది ఏజెన్సీ ఇన్స్పెక్టర్లు పరిశీలించి నివేదిక తయారుచేస్తారు. ఈనేపథ్యంలో జరిగిన ఆడిటింగ్‌లో కొన్ని లావాదేవీలపై అనుమానం వ్యక్తమైంది. 'గిఫ్ట్ టు క్లయింట్స్' పేరుతో దాదాపు ఒక మిలియన్ యూరోల (సుమరుగా రూ.8.62కోట్లు) ఖర్చును దస్సాల్ట్ చూపటం బయటపడింది. 'డెఫ్సిస్' అనే ఇండియన్ కంపెనీకి (మధ్యవర్తి సుషేన్ గుప్తాకి చెందినది) ఈ మొత్తాన్ని దస్సాల్ట్ చెల్లించినట్టు రశీదు ఉంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా డస్సాల్ట్ అధికారుల్ని ఏఎఫ్ఏ ఇన్స్పెక్టర్లు కోరారు.
ఏజెంట్ గుప్తా.. ఎవరీ మధ్యవర్తి ?
ఎరోనాటికల్, రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఏజెంట్ సుషేన్ గుప్తా పేరుమోసిన వ్యక్తి. దశాబ్దాలుగా ఆయన కుటుంబం ఈ వ్యాపారంలో ఉంది. అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్లలో గోలుమాల్ జరిగిందని ఇతడిపై సీబీఐ కేసు నమోదుచేసింది. ఈడీ దాడులు జరిపింది. ఇలాంటి వ్యక్తి రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ మధ్యవర్తిగా ఉన్నాడన్నది ఇప్పుడు బయటపడింది.
భారత్‌లో 'డెఫ్సిస్ సొల్యూషన్స్' అనే సంస్థ ఇతడిదే. దస్సాల్ట్‌కు ఇండియాలో సబ్ కాంట్రాక్ట్‌గా నమోదైంది. దస్సాల్ట్ కుదుర్చుకున్న ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్ కాంట్రాక్ట్‌లో 'డెఫ్సిస్' అనే కంపెనీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. 50 ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్స్ తయారుచేసి ఇచ్చినందుకు దస్సాల్ట్ ఒక మిలియన్ యూరోలు 'డెఫ్సిస్'కు చెల్లించినట్టు రశీదు చూపింది. ఫ్రెంచ్ అవినీతి అధికారులు దీనిని బోగస్ రశీద్గా పేర్కొంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
రాఫెల్ ఒప్పందంలో..సుషేన్ గుప్తా మధ్యవర్తిత్వం గురించి జనవరి, 2019లో ఇండియాలోని కోబ్రాపోస్ట్, ఎకనామిక్ టైమ్స్..వంటివి వార్తా కథనాలు వెల్లడించాయి. ఏఎఫ్ఏ ఆడిటింగ్ నివేదికలో తేలిన అంశాలపై దస్సాల్ట్ కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయబోమని దస్పాల్ట్ ప్రతినిధులు తెలిపారు. కాగా దస్సాల్డ్ అధినేత ఇటీవల కన్నుమూశారు. రాఫెల్ డీల్ వెనుక మర్మందాగిఉన్నదని ఆర్థికవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాఫెల్ ఒప్పందంపై స్వతంత్ర దర్యాప్తు : కాంగ్రెస్
అరవై వేల కోట్ల రూపాయిల విలువ చేసే రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ ప్రతి రక్షణ కొనుగోలు ఒప్పందంలో ఇంటెగ్రెటీ క్లాజు (సమగ్రతా నిబంధన) అనేది వుటుందని అన్నారు.
ఎలాంటి మధ్యవర్తులు వుండరాదని, ముడుపుల చెల్లించరాదని అందులో ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ఎక్కడైనా మధ్యవర్తులు వున్నా లేదా ముడుపులు చెల్లించినా అందుకు తీవ్ర పర్యవసానాలు వుంటాయని కూడా పేర్కొంటోందని తెలిపారు. సరఫరా చేసిన రక్షణ కంపెనీని నిషేధించడం, కాంట్రాక్టును రద్దు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ రక్షణ సరఫరాల కంపెనీలపై భారీ మొత్తంలో జరిమానాలు విధించడం వంటివి వుంటాయి. ఇవన్నీ ఇప్పుడు జరిగాయా? అని సుర్జేవాలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.