Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ సహా ఆరు దేశాల సరుకులపై టారీఫ్ పెంపు
వాషింగ్టన్ : భారత్ సహా పలు దేశాల నుంచి దిగుమతి అవుతున్న సరుకులపై పన్ను టారీఫ్ పెంచాలని అమెరికా నిర్ణయించింది. బ్రిటన్, టర్కీ, స్పెయిన్, ఇటలీ, భారత్, ఆస్ట్రియా దేశాల దిగుమతులపై గరిష్టంగా 25శాతం పన్ను టారీఫ్ పెంచడానికి జో బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు ఒక బిలియన్ డాలర్ల (సుమారుగా రూ.7345కోట్లు) వరకు పన్ను టారీఫ్ పెంపు ఉంటుందని తెలిసింది. ఆస్ట్రియా నుంచి పియానోలు, బ్రిటన్ నుంచి రౌండు బోట్లు, టర్కీ నుంచి రగ్గులు, ఇటలీ నుంచి చేపలు...వీటన్నింటిపైనా గరిష్టస్థాయిలో పన్ను టారీఫ్‌లు విధించబోతున్నారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలు, వెదురు ఉత్పత్తులు, బంగారు ఆభరణాలు, కిటికీ కర్టైన్లు, ఫర్నిచర్...మొదలైనవాటిపై పన్ను టారీఫ్ పెరగనున్నది.
అమెరికాకు చెందిన బడా కార్పొరేట్ సంస్థలైన అమెజాన్, ఫేస్బుక్, ఇతర టెక్నో కంపెనీల సేవలపై భారత్, బ్రిటన్, టర్కీ...మొదలైన దేశాలు పన్నులు విధిస్తున్న నేపథ్యంలో, దీనికి ప్రతిగా అమెరికా ఆయా దేశాల ఉత్పత్తులపై పన్ను టారీఫ్ పెంపునకు సిద్ధమైందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా కంపెనీల నుంచి ఆయా దేశాలు ఎంతమొత్తంలో పన్ను ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయో, దానికి సమానంగా ఆయా దేశాలపై పన్ను టారీఫ్‌లు పెంచాలని అమెరికా భావించిందని సమాచారం. అమెరికా నిర్ణయాన్ని అమెజాన్, ఫేస్బుక్, ఆల్ఫాబెట్, గూగుల్..మొదలైన టెక్నొ కంపెనీలు స్వాగతించాయి.