Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్(99) శుక్రవారం కన్నుమూశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరిన ఆయన గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత మార్చి 16న ఇంటికి చేరుకున్నారు. అయితే అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. విండ్సర్ క్యాస్టిల్లో ఉదయం సమయంలో ఆయన కన్నుమూసినట్లు పేర్కొంది. దాదాపు ఏడు దశాబ్ధాల పాటు పిలిప్ బ్రిటన్ రాజకుటుంబంలో ప్రముఖ వ్యక్తిగా వెలుగొందారు. పిలిప్ను అధికారికంగా డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్గా పిలుస్తారు. గ్రీకు రాకుమారుడైన పిలిప్ 1947లో ఎలిజబెత్‌ను వివాహం చేసుకుని బ్రిటన్ రాజ్యానికి వచ్చారు. అప్పటి నుంచి దాదాపు 69 ఏళ్ల పాటు తన భార్య రాణి ఎలిజబెత్ వెన్నంటి ఉంటూ పాలనపరంగా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించారు. 2017లో రాచరికపు విధుల నుంచి పిలిప్ రిటైర్ అయ్యారు. 'నా భర్తే నాకు కొండంత బలం' అని 1997లో తమ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాణి ఎలిజబెత్ తన ప్రసంగంలో తెలిపారు.
ప్రపంచ నేతల నివాళులు
ప్రిన్స్ పిలిప్ మృతికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు నివాళులర్పించారు. మిలటరీలో ఆయన సేవలు విశిస్టమైనవని, అనేక సమాజ సేవా కార్యక్రమాల్లో ముందున్నారని భారత ప్రధాని మోడీ అన్నారు. పిలిప్ పలు తరాల అభిమానాన్ని సంపాదించుకున్నాడని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఇంకా, జర్మనీ, అమెరికా, ఐర్లాండ్, తదితర దేశాలకు చెందిన నేతలు పిలిప్ మృతికి సంతాపం ప్రకటించారు.