Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత జలాల్లో నేవిగేషన్ ఆపరేషన్
- మారిటైమ్ పాలసీని ఉల్లంఘించామని బహిరంగంగానే ప్రకటన
న్యూఢిల్లీ : అమెరికా నావికా దళం అత్యుత్సాహం ప్రదర్శించింది. ఎటువంటి సమాచారం, ముందస్తు అనుమతి లేకుండా హిందూ మహాసముద్ర పరిధిలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) జలాల్లో ఆ దేశ నేవీ నేవిగేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా నేవీ 7వ ఫ్లీట్ స్వయంగా ఈనెల 7న అధికారికంగా అంగీకరించింది. భారత్‌కు చెందిన జల్లాల్లో 'ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్ (ఎఫ్‌ఓఎన్‌ఓపీ) నిర్వహించి ఆ దేశ మారిటైమ్ పాలసీని ఉల్లంఘించామని అమెరికా నేవీ ఈ సందర్భంగా బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో, లక్షదీవులకు పశ్చిమంగా దాదాపు 130 నాటికల్ మైళ్ల దూరంలో.. భారత ముందస్తు అనుమతి లేకుండా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా 'యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్' యుద్ధనౌక విన్యాసాలు నిర్వహించి నేవిగేషనల్ రైట్స్, ఫ్రీడమ్స్ను బలంగా ప్రకటించిందని తెలిపింది. దీనిని ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్స్ (ఎఫ్‌ఓఎన్‌ఓపీ) అని పేర్కొంది.
భారత అధిక సముద్ర వాదనలను సవాలు చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టంలో గుర్తించబడిన సముద్రంపై హక్కులు, స్వేచ్ఛ, చట్టపరమైన వినియోగాన్ని ఈ ఎఫ్‌ఓఎన్‌ఓపీ నొక్కి చెప్పిందని అమెరికా నేవీ 7వ ఫ్లీట్ తన ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక ఆర్థిక మండలిపై భారత్ వాదనలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించింది. ఈ ప్రత్యేక ఆర్థిక మండలిలో లేదా కాంటినెంటల్ షెల్ఫ్‌లో సైనిక విన్యాసాలకు లేదా కార్యకలాపాలకు ముందుగా తన అనుమతి తీసుకోవాలని భారత్ చెప్తోందని, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. అమెరికా రక్షణ విభాగం నివేదికల ప్రకారం.. భారత ఈఈజెడ్‌లో అమెరికా నేవీ 2007 నుంచి 2017 వరకు ఈ ఎఫ్ఓఎన్ఓపీలను నిర్వహించింది. 2018, 2020లో నిర్వహించకపోగా, 2019లో జరిగినట్టు రక్షణ విభాగం వార్షిక నివేదికలు పేర్కొన్నాయి.
అమెరికా నేవిగేషన్ ఆపరేషన్ పట్ల భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా స్పందన రాలేదు. ప్రస్తుత పరిస్థితిపై భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ ఈఈజెడ్‌లో సైనిక విన్యాసాలకు మాత్రమే ఇతర దేశాలు మన అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, రవాణాకు అవసరం లేదని అన్నారు. 'సైనిక విన్యాసాలు' అనే పదాన్ని అమెరికా నేవీ ఎక్కడా తన ప్రకటనలో పేర్కొనలేదని తెలిపారు. భారత నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. 1995లో ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన సముద్రాల చట్టాన్ని భారత్ ఆమోదించిందని, అమెరికా ఇప్పటి వరకు ఆ పని చేయలేదని తెలిపారు. భారత ఇఇజెడ్లో అమెరికా నేవీ ఆపరేషన్ నిర్వహించడం దేశీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని అన్నారు. ఇది సరికాదనీ, పైగా పబ్లిసిటీ చేసుకుంటుకున్నారని విమర్శించారు.