Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సదస్సులో అనేక దేశాలు పాల్గొనలేకపోతున్నాయి..
- వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలే కారణం : పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్
స్టాక్‌హోం : ఈ ఏడాది నవంబరులో స్కాట్లాండ్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు హాజరుకావటం లేదని ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ తెలిపారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, దీనివల్ల సదస్సుకు అనేక దేశాల నుంచి ప్రతినిధులు రావటం లేదని ఆమె తెలిపారు. ఇందుకు నిరసనగా ఐరాస పర్యావరణ సదస్సుకు హాజరుకావటం లేదని ట్విట్టర్ సందేశాన్ని పోస్ట్ చేశారు. ధనిక దేశాలు ఔషధాలు, వ్యాక్సిన్లను ఇతరదేశాలతో పంచుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె ఆరోపించారు. ''ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలి. ఈ విషయంలో ప్రజలంతా సమానమనే భావన ఉండాలి. కొన్ని దేశాలకు మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం అప్రజాస్వామికం. ఇది కోవిడ్ సంక్షోభాన్ని మరింత పెంచుతుంది'' అని గ్రెటా అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, పసిఫిక్ దీవులు, ఆసియా, మధ్యప్రాచ్యంలోని అభివృద్ధి చెందుతున్నదేశాలకు కోవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్ అందుబాటులో లేవన్న అంశాన్ని ఈ సందర్భంగా గ్రెటా లేవనెత్తారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతల వల్ల ఆయా దేశాల ప్రజల అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు నెలకొన్నాయని తెలిపారు.