Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా యుద్ధనౌక విన్యాసాలపై పెంటగాన్ స్పందన
- ఇవన్నీ మామూలే : అమెరికా నౌకాదళం
పెంటగాన్: భారత సముద్ర జలాల్లోకి అనధికారికంగా ప్రవేశించి (అమెరికా క్షిపణి నిరోధక యుద్ధనౌక-జాన్‌పాల్ జోన్స్) యుద్ధ విన్యాసాలు చేపట్టిన విషయంపై తన చర్యను అమెరికా నౌకాదళం సమర్థించుకుంది. లక్షద్వీప్ సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థికమండలి (ఈఏజెడ్)లో నౌకా విన్యాసాలు చేపట్టడం అంతా కూడా అంతర్జాతీయ చట్టాల ప్రకారమే జరిగిందని అమెరికా నౌకాదళం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. లక్షద్వీప్‌కు పశ్చిమంలో 130 నాటికల్ మైళ్లదూరంలో అమెరికా క్షిపణి నిరోధక యుద్ధ నౌక 'ఫ్రీడం ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్' పేరుతో ఈనెల 7న యుద్ధ విన్యాసాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. అమెరికా చర్య పట్ల తన నిరసనను వ్యక్తం చేసింది. దౌత్య మార్గంలో తమ నిరసనను వాషింగ్టన్కు తెలియజేస్తామని భారత్ ప్రకటించింది. న్యూఢిల్లీ అనుమతి తీసుకోకుండానే అమెరికా యుద్ధ నౌక భారత్ సముద్ర జలాల్లో యుద్ధ విన్యాసాలకు దిగటం చర్చనీయాంశమైంది. అమెరికా నౌకాదళానికి ఇవన్నీ మామూలేనని, గతంలో కూడా ఇలా విన్యాసాలు చేశామని, భవిష్యత్తులో కూడా చేస్తామని అమెరికా నౌకాదళానికి చెందిన ఏడో ఫ్లీట్ ప్రకటించింది. ఈ ప్రకటన భారత్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. భారత్ అభ్యంతరాలపై పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం) అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..'' నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్పగలను. మాల్దీవులకు సమీపంలో అమెరికా యుద్ధ నౌక విన్యాసాలకు దిగింది. దీనికి సంబంధించి అన్ని హక్కులూ, స్వేచ్ఛ నౌకకు ఉన్నాయి. ఆ దేశ ప్రాదేశిక సముద్ర జలాల పరిధిలో విన్యాసాలు జరిపే నిమిత్తం భారత ప్రత్యేక ఆర్థికమండలి (ఈఏజెడ్) నుంచి నౌకా యానం జరిగింది. దీనికి ఎవరి దగ్గరా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు'' అని అన్నారు.