Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మినియాపోలీస్‌లో యువకుడు మృతి
- ఘటనపై నిరసనకు దిగిన పౌరులపై పోలీసులు దాడి
వాషింగ్టన్ : మరో నల్లజాతీయుడిపై అమెరికా పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి...అతడి ప్రాణాల్ని బలితీసుకున్నారు. మిన్నియాపోలీస్‌లో గత ఏడాది మేలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగిన స్థలానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బ్రూక్లిన్ సెంటర్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగిన నిరసనల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. కొంతమంది నిరసనకారులను కిందపడేసి తీవ్రంగా కొట్టారని 'ఏఎఫ్‌పీ' మీడియా సంస్థ వార్తా కథనం తెలిపింది. నిరసనకారులపై పోలీసుల దాడికి సంబంధించి సన్నివేశాన్ని ఏఎఫ్‌పీ వీడియో జర్నలిస్టు చిత్రీకరించి వెబ్సైట్లో పోస్ట్‌చేశారు. నల్లజాతి యువకుడి హత్యపై బ్రూక్లిన్ సెంటర్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటన ఈ విధంగా ఉంది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించాడని (డాంటే రైట్ ) కారును పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఉన్న డాంటే రైట్‌పై అరెస్టు వారెంట్ కూడా ఉందని పోలీసులకు తెలిసింది. అతడ్ని కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. డాంటే రైట్ కారు వెనక్కి వెల్లే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఒక పోలీసు అధికారి హఠాత్తుగా అతడిపై కాల్పులు జరిపాడు. సెకన్ల వ్యవధిలోనే డాంటే రైట్ ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న ఒక మహిళకు కూడా కాల్పుల వల్ల తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ కాల్పుల ఘటనను నిరసిస్తూ బ్రూక్లిన్ సెంటర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. పోలీసు కాల్పులను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగి, లాఠీచార్జీ జరిపాయి. గాల్లోకి కాల్పులు సైతం జరిపారు. ఉద్రిక్త వాతారణం తగ్గాక నిరసనకారులు శాంతియుతంగా తమ ఆందోళనను కొనసాగించారు. కొవ్వొత్తులు వెలిగించి 'జస్టిస్ ఫర్ డాంటే రైట్' అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నల్లజాతి యువకుడి హత్యను బ్రూక్లిన్ సిటీ మేయర్ మైక్ ఇల్లియాట్ తీవ్రంగా ఖండించారు. ఇది విషాద ఘటనగా పేర్కొన్నారు. నిరసనకారులు తమ ఆందోళనను శాంతియుతంగా కొనసాగించాలని ఆయన కోరారు. గత ఏడాది మేలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని అత్యంత పాశవికంగా మిన్నియాపోలీస్‌లో పోలీసులు చంపేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ పోలీసు అధికారి డెరెక్ చావిన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో మరో నల్లజాతీయుడి హత్య ఘటన చోటుచేసుకుంది.