Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుకిషిమా అణుప్లాంట్నుంచి వెలువడిన..
- జపాన్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు..
టోకియో: గతంలో జపాన్‌లోని ఫుకుషిమా అణుప్లాంట్ ప్రమాదం జరిగిన ఘటన మరవకముందే...ఆ అణు ప్లాంట్ నుంచి మిలియన్ టన్నుల వ్యర్థ జలాలను త్వరలో సముద్రంలోకి వదలాలని జపాన్ ప్రభుత్వ నిర్ణయించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మత్స్యకార వర్గాలతో పాటు చైనా ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వాస్తవానికి ఈ ప్రక్రియ ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా..పలు అభ్యంతరాలతో ఇప్పటి వరకు ముందుకు కదల్లేదు. తాజాగా జపాన్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే చైనా స్పందించింది. ''ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్య'' అని ఆగ్రహం వ్యక్తంచేసింది.జపాన్ చర్యను అంతర్జాతీయ అణుశక్తి కమిషన్ (ఐఏఈఏ) సమర్థించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అణుకేంద్రాల వద్ద జరిగే చర్యవంటిదే ఇది అని పేర్కొంది. దీనిపై జపాన్ ప్రధాని యషిహిడే సుగా మంత్రి మండలి సమావేశంలో మాట్లాడుతూ.. అణుకేంద్రాన్ని మూసేయాలంటే ఏండ్లు పట్టే చర్యలో ఇది ఒక భాగమేనని పేర్కొంది. ఇది స్వాగతించదగిన పరిణామం అని పేర్కొన్నారు. ఆ నీరు సురక్షితమైందని తేలిన తర్వాతనే దానిని సముద్రంలోకి విడుదల చేస్తామని ఆయన వివరించారు.సునామీ తర్వాత ఫుకుషిమా అణు విద్యుత్తు కేంద్రం దెబ్బతిన్నాక దాదాపు. 1.25 మిలియన్ టన్నుల నీటిని అక్కడి తొట్టెల్లో ఉంచారు. వీటిల్లో అణు రియాక్టర్‌ను చల్లబర్చేందుకు వాడినవి, వర్షపునీరు వంటివి ఉన్నాయి. అత్యాధునిక అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఏఎల్‌పీఎస్) వ్యవస్థ ద్వారా దీనిని శుద్ధి చేశారు. దీనిలో చాలా వరకు రేడియోధార్మిక వ్యర్థాలను తొలగించామని జపాన్ చెబుతున్నా.. పర్యావరణవేత్తలు మాత్రం సాగరం మరింతగా కలుషితమవుతుందన్న ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.