Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిలిటరీకి పెద్ద పీట
- దేశీయ కార్యక్రమాలకూ నిధుల పెంపు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన మొదటి బడ్జెట్లో మిలిటరీ వ్యయానికి పెద్ద పీట వేశారు. దీంతోబాటు దేశీయ కార్యక్రమాలపై ఖర్చు పెంచినప్పటికీ మిలిటరీ వ్యయాన్ని భారీగా పెంచడంపై అటు అమెరికన్ కాంగ్రెస్‌లోని ప్రగతిశీలురు, ఇటు మితవాదులు ఇరువురి నుంచి విమర్శలెదురయ్యాయి. ఆర్థిక మాంద్యం, కోవిడ్ సంక్షోభంతో ప్రజలు సతమతమవుతుంటే మిలిటరీ ఖర్చును తగ్గించాల్సింది పోయి పెంచుతారా అని డెమొక్రాట్లలోని ప్రగతిశీల వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లికన్లు మాత్రం యుద్ధాల కోసం మిలిటరీ బడ్జెట్‌ను మరింత పెంచాలని పట్టుబట్టారు. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మొదలై, మార్చి31తో ముగుస్తుంది. దీనికి భిన్నంగా అమెరికా ఆర్థిక సంవత్సరం ప్రతియేటా అక్టోబరు1న మొదలై సెప్టెంబరు30 కల్లా ముగుస్తుంది. అల్పాదాయ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు చదివే స్కూళ్లకు 3,650 కోట్ల డాలర్లు కేటాయించారు. పచ్చి మితవాది ట్రంప్ చేపట్టిన మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. పర్యావరణ పరిరక్షణ సంస్థకు ట్రంప్ 27 శాతం మేర నిధులు కోత పెట్టగా, బైడెన్ దీనికి 21 శాతం పెంచారు. ట్రంప్ హయాంలో మిలిటరీ వ్యయాన్ని నాలుగేళ్లలో 20 శాతం పెంచారు. అయితే ఆ మొత్తంలో ఎక్కువ భాగం మెక్సికో గోడ నిర్మాణానికి మళ్లించారు. ఈ బడ్జెట్‌పై సోషలిస్టు డెమొక్రాట్ బెర్నీ శాండర్స్ మాట్లా డుతూ, దేశంలో సగం మంది పే చెక్‌ల మీద ఆధారపడి బతుకుసాగిస్తున్నారు. లక్షలాది మంది వృద్ధులు కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న అత్యధిక ప్రజానీకానికి దీర్ఘ కాలంలో ఈ బడ్జెట్ కొంత మేర తోడ్పాటునిస్తుందని అన్నారు. అయితే, మిలిటరీ వ్యయం కింద 75,300 కోట్ల డాలర్లు కేటాయించడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.సెప్టెంబరు 30తో ముగిసే ట్రంప్ చివరి ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన దానికన్నా ఇది 1230 కోట్ల డాలర్లు ఎక్కువ అని శాండర్స్ పేర్కొన్నారు. కోవిడ్‌తో దేశం మొత్తం అల్లకల్లోలానికి గురవుతున్న ఈ పరిస్థితుల్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధులు దశాబ్దం క్రితంతో పోల్చితే 10 శాతం తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం అమెరికా సెప్టెంబరు30 తో ముగిసే 2021 ఆర్థిక సంవత్సరంలో 64,900 కోట్ల డాలర్లు కేటాయించగా, చైనా 25వేల కోట్ల డాలర్లు సౌదీ అరేబియా 6,760 కోట్ల డాలర్లు, భారత్ 6,650 కోట్ల డాలర్లు వెచ్చించాయి.