Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబరు 11నాటికి పూర్తిగా బలగాల ఉపసంహరణ : బైడెన్
వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్ నుంచి మిగిలిన బలగాలన్నింటినీ పూర్తిగా ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సాగిస్తున్న సుదీర్ఘ యుద్ధంలో అమెరికన్ బలగాలు చనిపోవడానికి ఎప్పుడో 20ఏళ్ళ క్రితం జరిగిన సెప్టెంబరు 11 తీవ్రవాద దాడులను ఇంకా సాకుగా చూపలేమని బైడెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 2,500 మంది అమెరికన్ సైనికులు ఆఫ్ఘన్లో వున్నారు. వారినందరినీ ఈ ఏడాది సెప్టెంబరు 11నాటికి వెనక్కి పిలిపించాలన్నది బైడెన్ ఆలోచనగా వుంది. బుధవారం బైడెన్ ఈ మేరకు ప్రకటించిన వెంటనే బ్రస్సెల్స్‌లో నాటో చీఫ్ స్టోలెన్‌బర్గ్ స్పందిస్తూ, 7వేల మంది సైనికులను ఉపసహరించడానికి అంగీకరించినట్లు చెప్పారు. అవాంఛనీయమైన ఈ యుద్ధం కోసం మరిన్ని వనరులను వెచ్చించగలిగే స్థితి లేదని బైడెన్ చెప్పారు. గతేడాది ట్రంప్ హయాంలో మే 1కల్లా మొత్తంగా బలగాల ఉపసంహరణ పూర్తికావాలని గడువు విధించింది. కొత్తగా వచ్చిన బైడెన్ ప్రభుత్వం మే1 గడువును సెప్టెంబరు11కి పొడిగించింది.
ఆ గడువును ఏదో ఒక వంకతో అమెరికా మళ్లీ పొడిగించినా ఆశ్చర్యపోన్కక్కర్లేదని, అమెరికా చరిత్రే అంత అని అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆఫ్ఘన్‌పై రెండు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా సాగించిన ఈ యుద్ధంలో అమెరికాకు విజయం ఒక ఎండమావిలానే మిగిలిపోయింది. ఈ ఇరవై ఏళ్లలో ఈ యుద్ధం కోసం దాదాపు లక్ష కోట్ల డాలర్లు (ఇదంతా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము) తగలేసింది. 2,452 మంది అమెరికన్ సైనికులను బలిపెట్టింది.