Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మంది మృతి.. పలువురికి గాయాలు
- ఇండియానాపోలిస్లో ఘటన
వాషింగ్టన్ : అమెరికాలో మరోసారి భారీకాల్పుల ఘటన కలకలం రేపింది. ఇండియానాపోలీస్ నగరంలోని ఫెడెక్స్ గిడ్డంగి వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు పోలీసు లు తరలించారు. ఈ మేరకు ఇండియానాపోలీస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి గెనేవ్ కుక్ వెల్లడించారు. అయితే, ఈ కాల్పులు జరిపిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించినట్టు పోలీసు అధికారి చెప్పారు. అయితే, కాల్పుల ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను డిటెక్టివ్లు ప్రశ్నిస్తున్నారని ఆ అధికారి వివరించారు. కాల్పులు జరిపిన సాయుధున్ని గుర్తించడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఫెడెక్స్ గిడ్డంగిలో పని చేసే ఉద్యోగులను సెల్ఫోన్లు లోపలికి తీసుకెళ్లడానికి అనుమతించరు. దీంతో ఈ ఘటన అనంతరం ఉద్యోగులు.. తమ కుటుంబీకులను కలుసుకోవడం కష్టంగా తయారైంది. కాగా, కాల్పులు జరిగిన భవనం నుంచి ఉద్యోగులను బయటకు తరలించారు. గన్ కల్చర్ ఉన్న అమెరికాలో ఇలాంటి భారీ కాల్పుల ఘటనలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి.