Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రావుల్ క్యాస్ట్రో
- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా 8వ కాంగ్రెస్ సమావేశాల్లో వెల్లడి
హవానా : సోషలిస్టు దేశంగా క్యూబాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. 'ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ' బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రావుల్ క్యాస్ట్రో ప్రకటించారు. పార్టీలో సమర్ధుడైన, యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పజెపుతామని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా 8వ కాంగ్రెస్ సమావేశాల ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. '' పార్టీ ఫస్ట్ సెక్రటరీగా నా విధులు ముగిస్తున్నాను. పార్టీలో ఇన్నేండ్లుగా కొనసాగిన నా ప్రయాణం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాను. ఈ దేశ భవిష్యత్తు కోసం ముందు ముందు నా వంతు కృషి చేస్తానని బలంగా నమ్ముతున్నా''నని రావుల్ క్యాస్ట్రో అన్నారు. పార్టీ మహాసభ (కాంగ్రెస్) ముగింపు సమావేశ రోజైన 19న పార్టీ నాయకుడ్ని ప్రకటిస్తారని సమాచారం. క్యూబా అధ్యక్షుడు మిగ్వాల్ డియాజ్ కానెల్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పుతారని వార్తలు వెలువడుతున్నాయి.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా 8వ కాంగ్రెస్ సమావేశాలు ఏప్రిల్ 16న ప్రారంభమయ్యాయి. క్యూబా విప్లవమార్గాన్ని కొనసాగించడానికి పార్టీ నాయకత్వంలో పలు మార్పులు చేయటంపై సమావేశంలో చర్చించనున్నట్టు పార్టీ తెలిపింది. దేశంలో ఆర్థిక సంక్షోభం, మరోవైపు కరోనా వైరస్ తీసుకొచ్చిన కష్టాలు, ఇంకోవైపు అమెరికా నుంచి ఎదురవుతున్న ప్రతీకార చర్యల్ని ఎదుర్కోవటంపై సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలిసింది. దేశానికి, పార్టీకి ఈ 8వ కాంగ్రెస్ సమావేశాలు అత్యంత కీలకమైనవని, దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రభావితం చేస్తాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పార్టీ నాయకత్వ స్థానంలో ఉన్న సీనియర్ నాయకులు వారి వారి బాధ్యతల నుంచి తప్పుకొని యువ నాయకత్వానికి పగ్గాలు అప్పజెబుతున్నారని విశ్వసనీయ సమాచారం.
క్యూబా విప్లవంలో ముఖ్యనేతలుగా ఉన్న మొదటితరం నేతలు ఒక క్రమ పద్ధతిలో పార్టీలోని రెండో తరానికి బాధ్యతలు అప్పజెప్పాలని 2016లో జరిగిన 7వ పార్టీ కాంగ్రెస్ సమావేశంలో రావుల్ క్యాస్ట్రో వెల్లడించారు. గరిష్టంగా రెండుమార్లు మాత్రమే పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత పదవుల్ని చేపట్టాలని అన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో నాయకత్వ బాధ్యతలు చరిత్రాత్మక తరం నుంచి ఒక నూతన తరానికి బదిలీకావాలని ఆనాడు పార్టీ నిర్ణయించింది. ఈనేపథ్యంలో క్యూబా రాజకీయ నాయకత్వంలో మార్పులు ఆసక్తిని రేపాయని, దేశం ముందున్న సవాళ్లను ఈ కొత్త నాయకత్వం ఎలా ఎదుర్కొంటుందన్నది కీలకమైనదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబాలో అత్యంత సీనియర్ నాయకుడు రావుల్ క్యాస్ట్రో. క్యూబా విప్లవ నాయకుడు ఫైడల్ క్యాస్ట్రో వెన్నంటి నడిచారు. 1975 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. 1959 నుంచి 2008 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. వయస్సు, ఆరోగ్య సమస్యల కారణంగా అధ్యక్ష బాధ్యతల నుంచి ఫైడల్ క్యాస్ట్రో తప్పుకోగా, 2008లో రావుల్ క్యాస్ట్రోకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. రెండు టర్మ్‌లు మాత్రమే దేశ అధ్యక్ష బాధ్యతల్లో ఉంటానని, ఆ తర్వాత యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పజెపుతానని ఆనాడే రావుల్ ప్రకటించారు. అన్నట్టుగానే 2018లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని, పార్టీలో సీనియర్ అయిన మిగ్వాల్ డియాజ్ కానెల్‌ను అధ్యక్షుడ్ని చేశారు. తాజాగా పార్టీ 8వ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా పార్టీ నాయకత్వ స్థానం నుంచి తప్పుకొని సమర్థవంతమైన యువ నాయకత్వానికి అప్పజెపుతానని రావుల్ క్యాస్ట్రో ప్రకటించారు.