Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరవీరులకు నివాళులర్పించిన క్యూబన్లు
హవానా : బే ఆఫ్ పిగ్స్లో క్యూబా సాధించిన సైనిక విజయానికి 60 ఏండ్లు నిండాయి. సోమవారం 60వ వార్షికోత్సవాన్ని క్యూబావ్యాప్తంగా జరుపుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చిన, శిక్షణ ఇచ్చిన, నిధులు అందించిన 1500మంది బలగాల దాడిపై క్యూబా విప్లవ యోధులు వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. ఆరు దశాబ్దాల క్రితం ఈ పోరాటంలో క్యూబా వైపు నేలకొరిగిన 156మంది వీరుల స్మృత్యర్థం స్మారక స్థూపం వద్ద అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కేనల్ పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. క్యూబా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆనాటి యోధులను క్యూబా ఎన్నడూ మరిచిపోదని, కొత్త తరంలో మళ్లీ వారు జన్మిస్తారని అన్నారు. అమెరికా సాగిస్తున్న అణచివేత విధానాలు, ఆర్థిక పరిస్థితి, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లు ఎదురవుతున్నా మొక్కవోని దీక్షతో క్యూబన్లు ఐక్యంగా వున్నారని, సోషలిస్టు మాతృభూమిని పరిరక్షించుకునేందుకు కంకణబద్ధులయ్యారని పేర్కొన్నారు. హవానాకు ఆగేయంగా 220 కిలోమీటర్ల దూరంలోని ప్లాయా గిరాన్ ఆక్రమణదారుల చిట్టచివరి తీర ప్రాంతం. 72గంటల్లోనే అక్కడి అమెరికా బలగాలను క్యూబా వీరులు ఓడించారు.