Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాగా దెబ్బతినే ప్రాంతాల్లో దక్షిణాసియా దేశాలు
- హెచ్చరించిన వాతావరణ నివేదిక
- తక్షణమే కార్యాచరణ చేపట్టాలని గుటెరస్ పిలుపు
న్యూయార్క్ : వాతావరణ మార్పుల కారణంగా మనం నరకం ముంగిట్లో వున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ హెచ్చరించారు. వాతావరణ మార్పుల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో దక్షిణాసియా కూడా వుందని సోమవారం వెలువడిన ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. ఈ మార్పుల వల్లనే భారత ఉపఖండంలో, చైనా వంటి పొరుగు ప్రాంతాల్లో 2020లో చాలాసార్లు అసాధారణ రీతిలో అధిక వర్షపాతం నమోదైందని నివేదిక పేర్కొంది. భూగోళం ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతుండడంతో, ఇప్పటివరకు అత్యంత వేడిమి కలిగిన సంవత్సరాలుగా నమోదైన మూడింటిలో 2020 ఒకటిగా వుంది. కొవిడ్ మహమ్మారితో పాటుగా తీవ్రంగా వున్న వాతావరణ పరిస్థితులు తోడవడంతో ప్రపంచ దేశాల్లో కోట్లాదిమంది ఇబ్బందులు పడుతున్నారని నివేదికను ఆవిష్కరిస్తూ గుటెరస్ పేర్కొన్నారు. 2020లో భూగోళం సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక స్థాయికి ముందునాటి కన్నా 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని నివేదికను రూపొందించిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) పేర్కొంది. వాతావరణ మార్పులకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైన ప్రభావాలకు అడ్డుకట్ట వేయాలంటే 1.5డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటరాదని ఇప్పటికే హెచ్చరికలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ సంఖ్యకు చాలా దగ్గరగా వున్నామని నివేదిక పేర్కొంది. 2015 నుండి ఆరేళ్ళ పాటు అత్యంత వేడిమిగల సంవత్సరాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ దశాబ్దం ప్రారంభ సంవత్సరం కూడా వేడిగానే వుండబోతోంది. నవంబరులో గ్లాస్గో సమావేశానికి భేటీ కావడానికి ముందుగానే నిర్దిష్ట కార్యాచరణను చేపట్టడం ద్వారా 2021ని కార్యాచరణ సంవత్సరంగా ప్రకటించాలని గుటెరస్ ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు.
వాతావరణ మార్పులపై శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న పుతిన్
వాతావరణ మార్పులపై ఈ నెల 22న జరుగుతున్న అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. ఈ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ ఈ సమావేశంలో పుతిన్ పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రతికూల పర్యవసానాలను అధిగమించేందుకు ఉద్దేశించి విస్తృత అంతర్జాతీయ సహకారాన్ని నెలకొల్పేందుకు రష్యా వైఖరిని ఈ సమావేశంలో పుతిన్ వివరిస్తారని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. వీడియో సమావేశం ద్వారానే పుతిన్ పాల్గొననున్నారు. రష్యా ప్రతిపక్ష నేత నావల్నె విషయంలో ఉద్రిక్తతలు వున్నా ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాలు వాతావరణ చర్చలు జరిపాయి. అడవులు, అణు ఇంధనం, ఆర్కిటిక్ రంగాలను పరస్పర సహకారానికి వీలున్న రంగాలుగా గుర్తించారని మాస్కో టైమ్స్ పేర్కొంది.