Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్
- అన్ని దేశాల్లో కలిపి 14.18 కోట్ల మందికి కోవిడ్
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో).. రాబోయే మరికొన్ని నెలల్లో కరోనా వైరస్ను అదుపులోకి తీసుకురావచ్చుననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దీని కోసం కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేస్తూ.. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడం అత్యంత కీలకమైన అంశమని సూచించింది. అయితే, ప్రస్తుతం కరోనా మహమ్మారి ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తున్నదనీ, మహమ్మారిపై చేస్తున్న పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసి ముందుకు సాగాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రెయేసస్ పిలుపునిచ్చారు. ఇదివరకు 60 ఏండ్లు పైబడిన వారిపై కరోనా తన ప్రతాపాన్ని చూపగా.. ప్రస్తుతం 25 ఏండ్ల నుంచి 60 ఏండ్ల లోపువారిపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు.
అయితే, వైరస్ ఇదివరకటి కంటే రెట్టింపు వేగంతో వ్యాపించడానికి కారణం కొత్త వేరియంట్లే కారణమని ఆయన పేర్కొన్నారు. కరోనా విజృంభణతో 10లక్షల మంది ప్రాణాలు కోల్పోవడానికి 7నెలల సమయం పడితే, మరో నాలుగు నెలల్లోనే ఆ సంఖ్య 20లక్షలకు చేరింది. ఆ తర్వాత మరో మూడు నెలల్లోనే కరోనా మరణాల సంఖ్య 30లక్షలకు చేరడం ఆందోళన కలిగించే విషయమని టెడ్రోస్ అన్నారు. ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు14.18 కోట్లమందికి పైగా కరోనా బారిన పడ్డారని జాన్ హోప్కిన్స్ యూని వర్సిటీ వెల్లడించింది. వైరస్ కారణంగా ఇప్పటివరకూ 30.27 లక్షల మందికిపైగా చనిపోయారనీ, 8.11 కోట్లమంది వైరస్ బాధితులు కోలుకున్నారని వర్సిటీ తాజాగా గణాంకాలు విడుదల చేసింది.