Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లాయిడ్ హత్యకేసులో అరుదైన తీర్పు
- స్వాగతించిన బైడెన్
వాషింగ్టన్ : అమెరికాను కుదిపేసిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకేసులో నిందితుడు శ్వేతజాతి దుర్హంకారి అయిన మాజీ పోలీస్ అధికారి డెరెక్ చావిన్‌ను దోషిగా అక్కడి న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో 15 రోజుల పాటు వాద ప్రతివాదనలను విన్న పన్నెండు మంది న్యాయమూర్తులతో కూడిన జ్యూరీ మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. అయితే, శిక్షలు మాత్రం వెల్లడించలేదు. 2020 మే5న జార్జి ఫ్లాయిడ్ మెడపై మోకాలితో పది నిమిషాలపాటు గట్టిగా నేలకు అదిమి, ఊపిరాడకుండా చేసి అత్యంత పాశవికంగా చంపిన ఈ నరరూప రాక్షసుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ అమెరికాలోను, మిగతా ప్రపంచ దేశాల్లోను పెద్దయెత్తున నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఫ్లాయిడ్‌ను హతమార్చినందుకు 45 ఏళ్ల చువిన్ను సెకండ్ డిగ్రీ హత్య, థర్డ్ డిగ్రీ హత్య, సెకండ్ డిగ్రీ నరమేథం అభియోగాల కింద దోషిగా జ్యూరీ నిర్ధారించినందున
గరిష్టంగా 75 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. జ్యూరీ ఇచ్చిన తీర్పును కోర్టులో చదివి వినిపించారు. టివిలోను దీనిని ప్రత్యక్ష ప్రసారం గావించారు. జ్యూరీ ఇచ్చిన తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీలు చేస్తామని చావిన్ తరపు న్యాయవాదులు తెలిపారు. చావిన్ దోషి అని తీర్పు చెప్పిన న్యాయస్థానం ఆయన బెయిలును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలో అతి పెద్ద పౌర హక్కుల కేసులో తీర్పు వెలువరిస్తున్నప్పుడు కోర్టు హాలు చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తీర్పు వెల్లడించే సమయంలో కోర్టు బటయ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు.
తమ విధి నిర్వహణలో భాగంగా పోలీసు అధికారులు ఎవరినైనా హతమారిస్తే అందుకు వారిని బాధ్యులు చేసి శిక్షలు విధించే పరిస్థితి అమెరికాలో చాలా అరుదు అనే చెప్పాలి. పైగా చనిపోయింది నల్ల జాతీయులైతే ఇక వేరే చెప్పనక్కరలేదు. అయితే, ప్రపంచ దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ కేసులో జ్యూరీ ఇచ్చిన తీర్పు అమెరికా చరిత్రలో ఒక మైలురాయి వంటిది. ఫ్లాయిడ్ హత్య అమెరికాలో వర్ణ వివక్ష వికృత రూపాన్ని మరోసారి ప్రపంచం ముందుంచింది. పోలీసు దారుణాలకు జవాబుదారీతనం వుండాలని, చట్టం కింద అందరూ సమానులేనంటూ బ్లాక్ లైవ్స్ మేటర్ (బిఎల్ఎం) చేపట్టిన ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. ఆ నేపథ్యంలో వెలువడిన ఈ తీర్పు సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది.
తీర్పు పాఠాన్ని టీవిలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసక్తిగా దానిని ఆలకించారు. ఈ తీర్పును స్వాగతిస్తూ ''మన జాతి ఆత్మపై వ్యవస్థాగత వర్ణ వివక్ష ఒక మచ్చ వంటిది. ప్రతి రోజూ నల్ల జాతీయులు ఈ బాధను, నొప్పిని ఎదుర్కొంటూనే వున్నారు.'' అని వ్యాఖ్యానించారు.