Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపో మాపో బైడెన్ ఆమోద ముద్ర
వాషింగ్టన్ : చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా తైవాన్‌కు ఆయుధ అమ్మకాలు చేపట్టాలని అమెరికా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపో మాపో సంతకం చేయనున్నారు. బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా పన్నిన పన్నాగంలో భాగమే ఈ ఆయుధ అమ్మకాలు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆయుధాలు అమ్మితే సహించేది లేదని కూడా హెచ్చరించింది. ఈ హెచ్చరికల మధ్య సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌవిట్జర్ శతఘ్ని వంటి అధునాతన ఆయుధాలు, ఇతర పరికరాలను తైవాన్‌కు సరఫరా చేసేందుకు ఒప్పందం సిద్ధమైంది. ఈ ఒప్పందం ప్రకారం 2023 నుంచి దశలవారీగా 40 హౌవిట్జర్ శతఘ్నులను, ఇతర ఆయుధాలను తైవాన్‌కు అమెరికా అందజేస్తుంది. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తైవాన్‌తో కుదుర్చుకుంటున్న తొలి ఒప్పందం ఇదే. ట్రంప్ హయాంలో తైవాన్‌తో 11 ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గతేడాది తైవాన్ జలసంథిలో సైనిక ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు కుదుర్చుకున్న ఆరు ఒప్పందాలు కూడా ఇందులో వున్నాయి. బైడెన్ ప్రభుత్వ తాజా చర్య ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
చైనా పట్ల ఘర్షణ వైఖరి తీసుకోవడంలో గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ దూకుడును బైడెన్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది.అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే తైవాన్‌లో చిచ్చు రేపేందుకు బైడెన్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది. షాంఘైలోని ఫడాన్ వర్శిటీలో అమెరికా అధ్యయనాల కేంద్రం డైరెక్టర్ జిన్ క్వియాంగ్ గ్లోబల్ టైమ్స్‌తో సోమవారం మాట్లాడుతూ, తైవాన్ను తురుపు ముక్కగా చేసుకుని చైనాను దెబ్బతీయాలన్నది బైడెన్ ప్రభుత్వ పన్నాగంలా వుందని అన్నారు. చైనాను నిలువరించి తైవాన్‌కు తాము బాసటగా వున్నామని చెప్పడానికి అమెరికా పన్నుతున్న కుతంత్రాలు ఈ ప్రాంతంలో శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని జిన్ పేర్కొన్నారు. తైవాన్ వేర్పాటువాదులను రెచ్చగొట్టడమే కాకుండా, అమెరికా తన ఆయుధ బేహారులకు లాభాలు చేకూర్చేందుకు కూడా దీనిని ఒక సాధనంగా చేసుకుంటున్నదని బీజింగ్‌కి చెందిన సైనిక నిపుణుడు వెయి డోంగ్సూ వ్యాఖ్యానించారు.