Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సెనేట్ ఆమోదం
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆసియన్ అమెరికన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, విద్వేష దాడులను నివారించేందుకు 'ఎ హేట్ క్రైమ్స్ బిల్'ను అమెరికా సెనేట్ ఆమోదించింది. సభలో ఈ బిల్లు 94-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనేటర్ మిస్సౌరి ఒక్కరే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇక అనంతరం ఈ బిల్లు డెమోక్రాట్లకు స్పష్టమైన మెజార్టీ ఉండే ప్రతినిధుల సభకు వెళ్లనుంది. బిల్లును ఆమోదించాలని అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అది లాంచనం కానుంది. బిల్లుపై సెనేట్‌లో జరిగిన చర్చల్లో సెనేట్ మెజార్టీ నేత చుక్ స్కమ్మర్ మాట్లాడుతూ 'పనిచేసేందుకు అవకాశం ఇచ్చినప్పుడు.. సెనేట్ కచ్చితంగా పనిచేస్తుంది. ఒక ముఖ్యమైన సమస్యను పరిగణనలోకి తీసుకొని, దానిపై స్పందించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు రెండు వైపులకు చెందిన సభ్యులు కలిసి పనిచేశారు' అని పేర్కొన్నారు.
తాజా బిల్లు ప్రకారం.. కోవిడ్-19 సమయంలో పోలీసుల వద్దకు వచ్చిన ఈ విద్వేష నేరాలపై సమీక్షించేందుకు న్యాయశాఖ ఒక అధికారిని నియమిస్తుంది. నేరాలను నివేదించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వివక్షాపూరిత చర్యలను నియంత్రించేందుకు స్థానిక పోలీసులకు తగిన మార్గదర్శకాలు ఇస్తుంది. విద్వేష నేరాలపై వచ్చిన ఫిర్యాదులపై న్యాయశాఖ స్పందనను ఈ చట్టం మెరుగుపరుస్తుందని డెమోక్రాట్ సెనేటర్ డిక్ డర్బిన్ పేర్కొన్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి ప్రభావం ప్రారంభ సమయంలో ఆసియన్ అమెరికన్లపై విద్వేషపూరిత, హింసాత్మక దాడులు జరిగాయి. 'కుంగ్ఫ్లూ' వంటి పదాలను పేర్కొనడంతోపాటు వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ఆరోపిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేసి అమెరికాలో ఆసియన్ అమెరికన్ వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారని సామాజిక కార్యకర్తలు, పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.