Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడు ఇడ్రిస్ మరణంతో కుమారుడిని
తాత్కాలిక నాయకుడిగా ప్రకటించిన సైన్యం
ఎన్జమేనా : మధ్య ఆఫ్రికాలోని 'చాద్' దేశంలో అధ్యక్షుడు ఇడ్రిస్ దెబీ ఇత్నో మరణం తర్వాత ఆ దేశంలో తిరుగుబాటు యత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుగుబాటుదారులు చాద్ రాజధాని ఎన్జమేనా నగరాన్ని దిగ్బంధించే ప్రయత్నాలు చేశారు. ఇడ్రిస్ మరణం తర్వాత దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసిన తిరుగుబాటుదారులు అందుకు అనుగుణంగా రాజధానిలో ర్యాలీకి పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ మద్దతు ఉన్న ఇడ్రిస్ 1990 తిరుగుబాటు సమయంలో చాద్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఫ్రంట్‌లైన్ బలగాలను సందర్శించిన తరువాత యుద్ధ రంగంలో ఇడ్రిస్ దేబీ హత్య చేయబడ్డాడని ఆ దేశ సైన్యం ప్రభుత్వ టెలివిజన్, రేడియో ద్వారా వెల్లడించింది. అనంతరం దేబీ కుమారుడు మహమత్ను దేశానికి తాత్కాలిక నాయకుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారులు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ' చాద్ రాజరిక వ్యవస్థ కాదు. ఇక్కడ రాజరికపు అధికారం ఉండకూడదు' అని పేర్కొంది. అధ్యక్షుడు మరణిస్తే నేషనల్ అసెంబ్లీని సమావేశపరచాలన్న ఆ దేశ రాజ్యాంగానికి మహమత్ నియామకం విరుద్ధంగా ఉంది. ఇడ్రిస్ మరణ పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి. యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడిన ఇడ్రిస్ తీవ్రగాయాలతో మరణించారని మాత్రమే చెబుతోంది. ఇడ్రిస్ను లక్ష్యంగా చేసుకున్నారని, సైనిక తిరుగుబాటు జరిగిందని కొందరు పేర్కొంటున్నారు.
ప్రతిపక్షాల ఖండన
చాద్‌లో సంస్థాగత తిరుగుబాటు చోటుచేసుకుంటోందని పేర్కొన్న 30 ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రయత్నాలను బుధవారం ఉమ్మడి ప్రకటనలో ఐక్యంగా ఖండించాయి. కర్ఫ్యూలు విధించి, సరిహద్దులను మూసివేసి మహమత్ను రాజ్యాంగ విరుద్ధంగా తాత్కాలిక నాయకుడిగా నియమించారని దుయ్యబట్టాయి. ఇటువంటి చట్టవిరుద్ధమైన నిర్ణయాలను ఆమోదించవద్దని ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఫ్రాన్స్‌కు ప్రతిపక్షాలు హితవు పలికాయి.