Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయన్మార్ సైన్యానికి
ఆసియాన్ దేశాల డిమాండ్
జకర్తా : మయన్మార్‌లోని ప్రజలపై ఆ దేశ సైన్యం పాల్పడుతున్న హింసకు ముగింపు పలకాలని ఆసియాన్ గ్రూపు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత ఏర్పడిన రాజకీయ, మానవతా సంక్షోభంపై చర్చించేందుకు ఆసియాన్ నేతలు ఇండోనేషియా రాజధాని జకర్తాలో శనివారం సదస్సు నిర్వహించారు. మయన్మార్‌లో రాజకీయ పరమైన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆసియాన్ గ్రూపు తరపున ఒక ప్రత్యేక రాయబారిని నియమించినట్లు ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడో వెల్లడించారు. పౌరులపై హింసను విడనాడాలని, దేశంలో వెంటనే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు సంప్రదింపులు జరపాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని మయన్మార్ సైన్యాన్ని డిమాండ్ చేశారు. హింసను ఆపాలన్న ప్రతిపాదనను మయన్మార్ అంగీకరించిందని, ఈ సమావేశం విజయవంతమైందని మలేషియా ప్రధాని ముయిద్దిన్ యాసిన్ పేర్కొన్నారని బెర్మానా వార్తా సంస్థ తెలిపింది. మయన్మార్‌ను సందర్శించేందుకు ఆసియాన్, ఐరాస రాయబారులను అనుమతించాలని సింగపూర్ ప్రధాని లీ సియేన్ కోరారు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై మయన్మార్ సైన్యం పాల్పడిన హింసాకాండలో 700 మందికి పైగా పౌరులు మరణించారు.