Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 23న ఐరాసలో తీర్మానం
- క్యూబా విదేశాంగ మంత్రి రోడ్రిగజ్ వెల్లడి
హవానా :క్యూబాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష, నిరంకుశ ఆంక్షలకు ముగింపు పలకాలన్న డిమాండ్‌తో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం(జనరల్ అసెంబ్లీ)లో జూన్ 23న ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి బ్రునో రోడ్రిగుజ్ గురువారం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అమెరికా పాల్పడుతున్న దిగ్బంధనం తమ దేశంపై పాల్పడుతున్న మారణహోమం వంటిదని, ఇది స్పష్టమైన మానవ ఉల్లంఘనే అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో క్యూబాపై 243 బలవంతపు చర్యలు తీసుకుందని, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో కూడా అవి కొనసాగుతున్నాయని తెలిపారు. ' క్యూబాపై దిగ్బంధనం క్రూరమైన విధానం. ఇది క్యూబన్ కుటుంబాల బాధలు, ఇబ్బందులు, పలు కొరతలకు కారణంగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో అమెరికా తన నిరంకుశ చర్యలను మరింతగా పెంచి క్యూబాకు మెడిసిన్స్, వైద్య, ఇతర పరికరాలు అందకుండా అడ్డంకులు సృష్టించింది' అని రోడ్రిగుజ్ పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్యపరమైన ఆంక్షలు అమెరికన్ల ప్రయాణాలను నియంత్రించాయని, తద్వారా క్యూబా ఆదాయం తీవ్రంగా తగ్గిపోవడంతో పాటు అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడ్డాయని వివరించారు. ఇటువంటి అమానవీయ విధానాలకు ముగింపు పలికేందుకు అంతర్జాతీయ సమాజం మద్దతిస్తుందని క్యూబా ఆశిస్తున్నట్లు రోడ్రిగుజ్ పేర్కొన్నారు.