Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణుప్లాంట్ నిర్మాణంపై ఫ్రాన్స్ సంస్థ ఇడిఎఫ్ ప్రకటన
పారిస్ : మహారాష్ట్రలోని జైతాపూర్‌లో నిర్మించ తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ తిరిగి వార్తలోకి వచ్చింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రాన్స్‌కు చెందిన ఇంధన సంస్థ 'ఇడిఎఫ్' శుక్రవారం ప్రకటించింది. అణువిద్యుత్ప్లాంట్లు నిర్మిస్తే తలెత్తే ప్రమాదాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. దేశంలో మళ్లీ ఈ అణుప్లాంట్ అంశం ముందుకు రావడం చర్చనీయాంశమైంది. ఇంజనీరింగ్ అధ్యయనాలు, ఆరవ, మూడో జనరేషన్ ఇపిఆర్ రియాక్టర్లను నిర్మించేందుకు కావాల్సిన పరికరాలను సరఫరా చేసేందుకు బైండింగ్ ఆఫర్‌ను దాఖలు చేసినట్లు ఇడిఎఫ్ కంపెనీ పేర్కొంది. ఈ ప్లాంట్ పూర్తయితే ఇక్కడ 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందని, నిర్మాణానికి 15 సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. కొద్ది నెలల్లో ఈ కాంట్రాక్టు ఖరారవుతుందని భావిస్తున్నామని ఇడిఎఫ్ తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి 20 సంవత్సరాల క్రితం ప్రతిపాదన రాగా, స్థానికులు పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. 2011లో జపాన్‌లోని ఫుకుషిమాలో అణువిపత్తు తర్వాత ఇది మరింత ఆలస్యమైంది. అణు సాంకేతికత, ఇతర సంబంధిత విషయాలను పంచుకునేందుకు అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్ వంటి దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకుంది. ఈ విషయంలో భారత్‌కు సంప్రదాయ మిత్రుడిగా ఉన్న రష్యా అణు ఇంధనాన్ని సరఫరా చేయడంతో పాటు మన దేశంలో రియాక్టర్లను నిర్మించింది. ప్రస్తుతం భారత్‌లో 22 అణురియాక్లర్లు పనిచేస్తున్నాయి. వీటిలో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లే అధికంగా ఉన్నాయి. జైతాపూర్ ప్లాంట్ అంశం ముందుకు రావడంతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలోని అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణం విషయంలోనూ కదలికలు వచ్చే అవకాశముందని పరిశీలకులు పేర్కొంటున్నారు.