Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్ ప్రకటన నేపథ్యంలో అమెరికా రాయబారికి టర్కీ సమన్లు
అంకారా : అమెరికా రాయబారికి టర్కీ ప్రభుత్వం ఆదివారం సమన్లు జారీ చేసింది. అర్మేనియన్లపై ఊచకోతను మారణహోమంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ శనివారం అధికారికంగా గుర్తించిన నేపథ్యంలో టర్కీ పైవిధంగా స్పందించింది. బైడెన్ చర్య ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు ఆటంకం కలిగిస్తుందని, చారిత్రక అంశాలపై తీర్పు చెప్పే నైతిక హక్కు ఆయనకు లేదని టర్కీ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బైడెన్ ప్రకటన తమ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని విమర్శించింది. ' గత ఘటన జరిగి 100 సంవత్సరాలకు పైగా గడిచింది. ఇటువంటి సమయంలో అప్పటి గాయాలను నయం చేసి, భవిష్యత్తును నిర్మించేందుకు తగిన ప్రయత్నాలు చేయడానికి బదులుగా అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం లేదా శాంతి, సుస్థిరతలకు ఆటంకం కలిగించేలా ఉంది' అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్మేనియన్లపై ఊచకోత ప్రారంభమై 106 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో బైడెన్ శనివారం స్పందిస్తూ..' ఒట్టోమాన్ శకంలో చోటుచేసుకున్న ఆర్మేనియన్లపై మారణహోమంలో మరణించిన వారిని ప్రతి ఏడాడి ఈ రోజున గుర్తుచేసుకుంటాం. ఇదే సమయంలో అటువంటి దారుణాలు మరోసారి జరగకుండా నిరోధించేందుకు మనకు మనం కట్టుబడాలి' అని పేర్కొన్నారు.