Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా, పాకిస్థాన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ.. తదితర దేశాలు ప్రకటన
- కరోనాపై పోరులో భారత్‌కు పాక్ సంఘీభావం
ఇస్లామాబాద్ : కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు తమ వంతు సాయం చేస్తామని వివిధ దేశాలు ముందుకొచ్చాయి. వైరస్‌ను ఎదుర్కో వటంలో సాంకేతిక సాయం చేస్తామని చైనా తెలిపింది. మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ను ఇస్తామని జర్మనీ, అంబులెన్స్‌లు, పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి పంపుతామని పాకిస్థాన్ ప్రకటించాయి. భారత్‌లో కరోనా వైరస్ రెండో వేవ్ ఉధృతి చూస్తే హృదయ విదారకంగా ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి తక్షణం అదనపు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొంది. దీని గురించి తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో కరోనా రెండో వేవ్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం లక్షలాదిమంది వైరస్‌బారిన పడుతున్నారు. ఈ క్రమంలో పలు దేశాల అధినేతలు భారత్ పట్ల సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఏవిధంగానైనా సాయం చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్టు న్యూజీలాండ్ ప్రధాని ప్రకటించారు. భారత్‌కు అత్యవసర సాయం అందించడానికి సామగ్రిని సిద్ధం చేస్తున్నామని జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాలు భారత్‌కు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. '' కరోనాపై పోరులో ఇండియాకు సాయం చేయాలని అన్ని వైపుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అత్యవసరంగా కావాల్సిన ఆక్సీజన్, ఇంతర మందులు వెంటనే అందించడానికి యూరోపియన్ యూనియన్ సన్నద్ధంగా ఉంది'' అని ఈయూ విపత్తు నిర్వహణ కమిషనర్ జానెజ్ లెనార్కిస్ ట్విట్టర్లో ప్రకటన చేశారు.
ఆపన్న సాయానికి సిద్ధం : పాక్ వెల్లడి
పొరుగుదేశం పాకిస్థాన్ తనవంతు సాయం అందించేందుకు సిద్ధమైంది. '' భారత్‌కు తక్షణ సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయా సామగ్రిని త్వరితగతిన భారత్‌కు సరఫరా చేసేలా ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు కృషి చేయాలి. అంతేకాకుండా కరోనాపై పోరులో సాయం చేయడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నా...వాటి కోసం అన్వేషించాలి'' అని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం ప్రకటిస్తూ శనివారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ట్విట్టర్లో సందేశాన్ని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. భారత్ సహా పొరుగుదేశాలు మహమ్మారిబారి నుంచి త్వరగా బయటపడాలని ఇమ్రాన్‌ఖాన్ ఆకాంక్షించారు.
భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగాయి : ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లెయెన్
కరోనా మహమ్మారి విజృంభణతో భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారత్ విన్నపం మేరకు ఈయూ తన వనరులను సమీకరించి సాయం చేయడానికి సిద్ధం. సంక్షోభ సమయాన భారత ప్రజలకు పూర్తి సహకారం అందిస్తాం.