Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో ఆందోళనలు
వాషింగ్టన్ : క్యూబాపై అమెరికా అమలు చేస్తున్న వాణిజ్య, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా నగరాల్లో ఆదివారం నిరసనలు, ఆందోళనలు జరిగాయి. అమెరికాలోని ప్రధాన నగరాలు న్యూయార్క్, వాషింగ్టన్, డెట్రాయిట్, చికాగో, లాస్ఏంజెల్స్, శాక్రమెంటో, ఒక్లాండ్, శాండియాగో, శాన్ఫ్రాన్సిస్కో, లాస్‌వేగాస్, మిన్నిపొలిస్, సియాటెల్, ఇండియానాపోలిస్ల్లో ఇందుకు సంబంధించి పలు కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. క్యూబాలోని రెండు నగరాల్లో దాదాపు 3వేల మందికి పైగా క్యూబన్లు వీధుల్లోకి వచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లో కొవిడ్ ప్రభావం తక్కువగా వున్నందున నిరసనలకు వారీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. మియామి, బీజింగ్, వాంకోవర్, మాంట్రియల్లతో సహా ఐదు ఖండాల్లోని పలు నగరాల్లో ఇటువంటి ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలో నివసిస్తున్న క్యూబన్ ప్రొఫెసర్ కార్లోస్ లాజో చేపట్టిన చొరవతో ఇవి సాధ్యమయ్యాయి. 1959లో ఫైడల్‌కాస్ట్రో నేతృత్వంలో జరిగిన క్యూబన్ విప్లవం నాటి నుండి గత 60ఏళ్లుగా క్యూబాపై కొనసాగుతున్న ఆంక్షలను ప్రపంచవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారని చెప్పడమే ఈ కారవాన్ల లక్ష్యంగా వుంది. ఈ ఆంక్షలతో క్యూబా అభివృద్ధిపై తీవ్ర భారం పడుతోంది. ఆంక్షలను అంతం చేయాలని కోరుతూ 1992 నుండి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పెద్ద మెజారిటీతో తీర్మానాలను ఆమోదిస్తూనే వుంది. కానీ ఫలితం లేదు. క్యూబాలో అక్రమంగా ప్రభుత్వ మార్పు కోసం ప్రయత్నించడమే ఈ ఆంక్షల ప్రయత్నంగా వుంది. కానీ వాటన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొంటూ వచ్చింది. ఇటీవల కొవిడ్ సంక్షోభం తర్వాత అమెరికా ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.