Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మరణాలు అధికం!
న్యూయార్క్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాపితంగా 31 లక్షల కరోనా మరణాలు సంభవించగా, అందులో ఆరో వంతు (5,71,000 ) ఒక్క అమెరికాలోనే చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికాతోబాటు సంపన్న దేశాల కూటమిలో భాగస్వాములుగా ఉన్న మిగతా దేశాల్లోనూ కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. కరోనా వల్ల అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 1542 మరణిస్తుంటే, బ్రిటన్‌లో 1773, ఇటలీలో 1598, ఫ్రాన్స్‌లో 1294, జర్మనీలో819, కెనడాలో 572, జపాన్‌లో59 మంది చొప్పున చనిపోతున్నారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో పరిస్థితికి , సోషలిస్టు లేదా సోషలిస్టు తరహా విధానాలు అనుసరించే దేశాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెనిజులా ( 46), క్యూబా( 26), నికరాగువా (26), చైనా ( 3), వియత్నాం (0.4) చాలా మెరుగైన సామర్థ్యాన్ని కనబరిచాయి. ఈ దేశాల్లో ప్రభుత్వాలు సామాజిక, ప్రజాతంత్రయుత పద్ధతుల్లో పని చేయడం ఇందుకొక ముఖ్య కారణం. ఈ దేశాలే కాదు న్యూజిలాండ్ (5), ఫిన్లాండ్(132), స్కాండినేవియన్ దేశాలైన డెన్మార్క్ (404), నార్వే (112) సైతం జి-7 దేశాల కన్నా మెరుగైన రీతిలో ఈ విపత్తును ఎదుర్కోగలుగుతున్నాయి. మరో స్కాండినేవియన్ దేశమైన స్వీడన్ కరోనాను ఎదుర్కోలేక చతికిల పడింది. అక్కడ ప్రతి పది లక్షల మందికి 1247 మరణాలు చోటు చేసుకుంటున్నాయి. స్వీడన్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఇటీవల కాలంలో నయా ఉదారవాద విధానాలవైపు పూర్తిగా మొగ్గడమే ఈ వైఫల్యానికి కారణం. కరోనా మరణాల రేటును జనసాంద్రత, జనాభాలో వయోనిష్పత్తి వంటి వాటితో సహా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. మొత్తం మీద చూసినప్పుడు సోషలిస్టు అనుకూల విధానాలను అమలు చేసే చోట ప్రాణ నష్టం తక్కువగా ఉంది. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టంగావించడం, ప్రజల అవసరాలను తీర్చడం, కరోనా టెస్టింగ్, ట్రేసింగ్ పకడ్బందీగా నిర్వహించడం, అవసరమైన వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిచ్చాయి. పెట్టుబడిదారీ దేశాల్లో ప్రభుత్వాలు మనుషుల ప్రాణాల కన్నా, లాభాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఇది సాధారణంగా కనిపించే ధోరణి. అందుకే వీటిని కరోనా మరణాలు అనేదానికన్నా 'సామాజిక హత్యలు' అనడమే సరైనదని సామాజిక వేత్తలు కొందరు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఈ 'సామాజిక హత్యల' వికృత రూపాన్ని స్పష్టంగా చూడొచ్చు. అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సిడిసి) మొన్న ఫిబ్రవరిలో విడుదలజేసిన నివేదికలో వర్గ (సామాజిక ఆర్థిక హోదా) తారతమ్యాలు, అసమానతలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అమెరికాలో ఆరోగ్య సదుపాయాలు అందరికీ ఒకేలా అందుబాటులో లేవు. ఆసుపత్రిలో ప్రవేశం మొదలు మరణాల దాకా ఏ అంశంలో చూసినా ఈ అంతరాలు స్పష్టంగా కనిపిస్తాయి. కోవిడ్-19కి బలైన వారి లెక్కలను విశ్లేషిస్తే శ్వేత జాతీయుల కన్నా నల్ల జాతీయులే ఎక్కువ.జనాభా పరంగా చూసినప్పుడు నేటివ్ అమెరికన్లు, బ్లాక్, లాటినోల జనాభా శ్వేత జాతీయుల కన్నా ఎక్కువ. మరణాల రిస్క్ శ్వేత జాతీయుల కన్నా శ్వేతేతరుల్లో రెట్టింపు స్థాయిలో ఉంటున్నది. ఆసియన్ అమెరికన్లలో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఇంచుమించు శ్వేత జాతీయులతొ సమంగా ఉంటుంది. కరోనా మరణాల విషయానికి వస్తే 45 ఏళ్ల లోపు వయో గ్రూపునకు చెందినవారిలో హిస్పానిక్ తెగలో 40 శాతానికి పైగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నల్లజాతీయుల్లో ఇవి 25 శాతం దాకా ఉన్నాయి. వీరితో పోల్చినప్పుడు శ్వేత జాతీయుల్లో మరణాల రేటు తక్కువే. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, అధికాదాయ, అల్పాదాయవర్గాల మధ్య మరణాల రిస్కులో తేడాలున్నట్లు ఆ నివేదిక తెలిపింది.