Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : వ్యాక్సిన్లు కోసం భారత ప్రభుత్వం తమని కోరలేదని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ వంటి దేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలంటూ అమెరికాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై స్పష్టతనిచ్చింది. మీడియా సమావేశంలో హిందూ పత్రిక విలేకరి అడిగిన ప్రశ్నకు సీనియర్ అధికారి సమాధానం చెబుతూ ఉపయోగించడానికి సిద్ధగా వున్న వ్యాక్సిన్లు కావాలంటూ మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా అభ్యర్ధించలేదని చెప్పారు. అమెరికా వద్ద మిగులుగా వున్న వ్యాక్సిన్లను భారత్ వంటి దేశాలకు ఇవ్వాలని అమెరికన్ పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రముఖులు కోరుతున్నారు. ముఖ్యంగా లక్షలాది ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ డోసుల్లో కొన్నింటినైనా ఇవ్వాలని సూచిస్తున్నారు. ''సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుతం మన దగ్గర ఆస్ట్రాజెనికా డోసులు లేవు.'' అని వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి జెన్ సాకి సోమవారం నాటి సమావేశంలో చెప్పారు. ఎఫ్‌డిఎ (ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతి మంజూరు చేసిన వెంటనే కోటి డోసులు వరకు విడుదల చేయగలమని సాకి చెప్పారు. రాబోయే వారాల్లో ఈ క్రమం పూర్తవుతుందని భావిస్తున్నారు. మే, జూన్ మాసాల నాటికి మరో 5కోట్ల డోసులు సిద్ధమవుతాయని ఆశిస్తున్నారు. ప్రపంచదేశాల అవసరాలు, వారి అభ్యర్ధనలను పరిశీలించడానికి వైట్‌హౌస్ కొవిడ్ బృందం జాతీయ భద్రతా బృందాలతో, ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి కృషి చేస్తోందని ఆమె చెప్పారు.