Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్‌పై మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థ నివేదిక విమర్శ
జెరూసలేం : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ వర్ణ వివక్ష నేరాలకు పాల్పడుతోందని, వేధింపులకు దిగుతోందని మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థ (హెచ్ఆర్డబ్ల్యూ) నివేదిక విమర్శించింది. కాగా ఈ నివేదిక పట్ల తీవ్రంగా ఆగ్రహించిన ఇజ్రాయిల్ దాన్ని తిరస్కరించింది. 'అవాస్తవికమైన ఈ నివేదికకు, మానవ హక్కులకు ఏరకమైన సంబంధం లేదు. కానీ, యూదుల దేశంగా ఇజ్రాయిల్‌కు గల హక్కును దెబ్బతీసేందుకే ఇది ప్రయత్నిస్తోంది' అని ఇజ్రాయిల్ వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి మైఖేల్ బిటన్ వ్యాఖ్యానించారు. 213 పేజీలున్న ఈ నివేదికలో పేర్కొన్నవన్నీ అర్ధరహితమైనవి, అసత్యాలని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇజ్రాయిల్ వ్యతిరేక ఎజెండాను అనుసరిస్తున్నదంటూ మానవ హక్కుల గ్రూపును విమర్శించారు. పాలస్తీనా పౌరుల పట్ల వివక్ష ఆరోపణలను తిరస్కరించింది. మంగళవారం హెచ్ఆర్డబ్ల్యు నివేదిక వెలువడింది. ఇజ్రాయిల్‌లో, ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న పాలస్తీనియన్ల హక్కులను ఇజ్రాయిల్ ఉల్లంఘిస్తోందని ఆ నివేదిక విమర్శించింది. ఇజ్రాయిల్ అధికారులు చేసే ప్రకటనలు, విధానాలు, చట్టాలు ఇవన్నీ చూస్తుంటే ప్రజలపై, రాజకీయాధికారంపై, ప్రాంతంపై యూదు ఇజ్రాయిలీ నియంత్రణను కొనసాగించాలని ఇజ్రాయిల్ భావిస్తోందని స్పష్టమవుతోంది. ఈ లక్ష్య సాధనకు అనుగుణంగా ఇజ్రాయిల్ అధికారులు పాలస్తీనియన్లను వారి గుర్తింపు కారణంగా బహిష్కరించారు, పరిమితం చేశారు, బలవంతంగా వేరు చేశారు, లొంగదీసుకున్నారు.'' అని నివేదిక పేర్కొంది. కొన్ని చోట్ల అయితే ఈ పరిస్థితులు మరీ దారుణంగా వున్నాయని, వారు చేసే నేరాలు వర్ణవివక్ష, వేధింపులతో కూడినవిగా వున్నాయని వ్యాఖ్యానించింది. తామేమీ ఈ పదాలను అతిశయోక్తితో, వాగాడంబరంతో ఉపయోగించలేదని మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టంలో నిర్వచించిన మేరకే ఈ పదాలను ఉపయోగించామని పేర్కొంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)కి ఈ నివేదికను నివేదించనున్నారు. పాలస్తీనాలో పరిస్థితిపై దర్యాప్తు చేపట్టినట్లు ఐసిసి ప్రాసిక్యూటర్ కార్యాలయం మార్చిలో తెలిపింది.