Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : మే 15 వరకు భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ... భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించేందుకు నిర్ణయించామన్నారు. మే 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం భారత్లో తీవ్రంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోరిసన్ వెల్లడించారు.
చేయగలిగినంత సాయం చేస్తాం : ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ మాట్లాడుతూ.. గత 9 వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. భారత్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ దేశానికి తాము చేయగలిగిన సాయమంతా చేస్తామని హామీ ఇచ్చారు. అసలు పరిస్థితి ఊహించలేనంతగా ఉందని, ఇతర దేశాలకు లోగడ సాయం చేసిన భారత్ నేడిలా క్రైసిస్ ని ఎదుర్కోవడం ఆశ్చర్యకరమని అన్నారు. తాము ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ హాస్పిటల్స్ ను, లేబోరేటరీని ఇండియాకు పంపుతామని టెడ్రోస్ తెలిపారు. పోలియో, టిబి సహా వివిధ కార్యక్రమాలకు ఉద్దేశించి పని చేస్తున్న 2,600 మంది నిపుణులను భారత్ లో అధికారులకు, వైద్య సిబ్బందికి సాయపడేందుకు పంపుతున్నట్టు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియాను ఆదుకునేందుకు కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయని, ఇది అభినందించ దగినదని ప్రశంసించారు. మరిన్ని దేశాలు ఈ విషయంలో చొరవ చూపగలవని ఆశించారు.
బ్రిటన్ నుంచి భారత్కు చేరిన మెడికల్ ఎక్విప్మెంట్
భారతదేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. భారత్కు తమ వంతు సాయంగా బ్రిటన్ పంపిన వైద్య సామాగ్రి మంగళవారం న్యూఢిల్లీకి చేరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ' బ్రిటన్ పంపిన వైద్య సామగ్రి న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఉన్నాయి' అని పేర్కొంది. భారత్కు మొత్తం 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లతో పాటు 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ భారత్కు పంపనుంది. ఇందులో భాగంగా తొలి ప్యాకేజీ ఢిల్లీకి చేరుకుంది.