Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కులను కాలరాస్తున్న కంపెనీలు
తాజా అధ్యయనంలో వెల్లడి
బెర్లిన్ : ఇండ్లకు ఆహారాన్ని, ఇతర ఉత్పత్తులను సరఫరా చేసే డెలివరీ కార్మికుల పరిస్థితి కరోనాకు ముందే చాలా భయంకరంగా వుండేవి. తాజాగా కరోనా అనంతర కాలంలో వారి పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రెడ్రిక్-ఎబర్ట్ స్టిఫ్టంగ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కార్మికుల అశాంతిపై అధ్యయనం జరిపింది. తమ హక్కులను కాలరాస్తుండడంతో ఎక్కడ చూసినా కార్మికులు ఆందోళనలకు, నిరసనలకు దిగడం బాగా పెరిగిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రంగాలవారీగా సమ్మెలు జరుగుతున్నాయని అధ్యయనం పేర్కొంది. తాము పనిచేస్తున్న సంస్థల్లో జరుగుతున్న వ్యవస్థాగత అన్యాయాలకు వ్యతిరేకంగా వారు గొంతెత్తి తన నిరసన తెలియచేస్తున్నారు. దీనికి కరోనా మహమ్మారి ఒక వేదికను, ప్రేరణను ఇచ్చిందని అధ్యయన నివేదిక పేర్కొంది. కరోనా సంక్షోభానికి ముందు కూడా ఫుడ్ డెలివరీ కంపెనీల లాభార్జన ఆకాశాన్నంటింది. కానీ, మరోపక్క అందులో పనిచేసే డెలివరీ కార్మికుల పరిస్థితులు దారుణంగా వున్నాయి. తీవ్రంగా హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. వారు తమ హక్కుల సాధన కోసం యూనియన్‌గా ఏర్పడే అవకాశం కూడా లేకుండా నిషేధించారు. భారత్‌లో అత్యంత విజయవంతమైన సాంకేతిక రంగ స్టార్టప్‌ల్లో 12 కంపెనీలు తమ కార్మికుల గురించి ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని తేలింది. చిలీ నుండి దక్షిణ కొరియా వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు ఇవే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రోజులో చివరి డెలివరీని ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్ళేటపుడు ప్రమాదం జరిగితే దాన్ని విధుల్లో వుంటుండగా జరిగిన యాక్సిడెంట్‌గా కూడా గుర్తించని సంస్థలు వున్నాయి. డెలివరీకి ఇవ్వడానికి వెళుతూ మధ్యలో బాత్రూమ్ కోసం ఆగినా దానిని కూడా ముందుగా సూపర్వైజర్కి తెలియచేయాల్సిన పరిస్థితులు వున్నాయి. సూపర్వైజర్లు తమ ఇష్టానుసారం కార్మికులను తొలగించవచ్చు. మొత్తంగా కంప్యూటర్ నుండి కార్మికుల విధి నిర్వహణకు సంబంధించిన హిస్టరీనే తుడిచిపెట్టవచ్చు. అసలు కార్మికుడుగా పనిచేయడం లేదనే చూపవచ్చు. జర్మనీ బహుళజాతి కంపెనీ అయిన డెలివరీహీరో బ్రాంచ్‌లో పనిచేస్తున్న వెనిజులా శరణార్ధి హెర్నాండెజ్ విషయంలో ఇదే జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వారు గొంతెత్తి నినదించాల్సిన అవసరమూ పెరిగిపోయిందని నివేదిక పేర్కొంది.