Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బైడెన్ హయాంలో మరీ పెరిగిందని వ్యాఖ్య
బీజింగ్ : చైనా సముద్ర జలాలు, గగన తలం సమీపంలో అమెరికా మిలటరీ నిఘా కార్యకలాపాలు పెరగడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ముప్పు వాటిల్లుతుందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి గురువారం వ్యాఖ్యానించారు. జనవరి 20న బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా సముద్ర జలాలకు పక్కనే గల జలాల్లో అమెరికా నావికాదళానికి చెందిన నౌకల విన్యాసాలు 20శాతం పెరిగాయని అన్నారు. నిఘా విమానాల జోరు కూడా గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 40శాతం పెరిగిందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ వూ కియాన్ అన్నారు. ఏప్రిల్ 11న అమెరికా నావికాదళం ఒక ఫోటోను పోస్ట్ చేసింది. యుఎస్ డిస్ట్రాయర్ యుఎస్ఎస్ మస్టిన్ కమాండర్ రాబర్ట్ బ్రిగ్స్, నౌక ఎగ్జిక్యూటివ్ అధికారి రిచర్డ్ స్లియేతో కలిసి దూరంగా వున్న చైనా విమాన వాహక నౌక సిఎన్ఎస్ లియానింగ్ను చూస్తున్న ఫోటో అది. ఆ ఫోటో చాలా అసాధారణంగా వుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. చైనా సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అయింది. దక్షిణ చైనా సముద్రంలో, తైవాన్ జలసంధిలో ఇటీవల సిఎన్ఎస్ లియానింగ్ నిర్వహించిన శిక్షణా కార్యకలాపాలను కూడా యుఎస్ఎస్ మస్టిన్ చాలా నిశితంగా వీక్షించిందని వూ పేర్కొన్నారు. ఈ చర్య శిక్షణా కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడమే కాగలదని, పైగా చాలా కృత్రిమంగా వుందని వ్యాఖ్యానించారు. చైనా నౌకలు అమెరికా యుద్ధనౌకను హెచ్చరించి, అక్కడ నుండి పంపివేశాయని తెలిపారు. చైనా నుండి ముప్పు వుందంటూ ఇటీవల కాలంలో అమెరికన్ అధికారులు చేస్తున్న ప్రకటనలను కూడా ఆయన ఖండించారు.