Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ పార్లమెంట్ తీర్మానం
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ విషయంలో రష్యాపై కొత్త ఆంక్షలను ఈయూ పార్లమెంట్ రూపొందించింది. స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించాలని, రష్యా ఇంధన కొనుగోలును నిలిపివేయాలని, ఇతర కఠిన చర్యలను సిఫార్సు చేస్తూ తూర్పు యురోపియన్ పార్లమెంట్ సభ్యుల బృందం యురోపియన్ పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్పై దాడికి రష్యా సన్నద్ధమవుతోందని ఆరోపించడంతో పాటుగా అనేక ఇతర నేరాలకు పాల్పడుతోందంటూ ఆ తీర్మానం రష్యాని విమర్శించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన పక్షంలో పలు రష్యా వ్యతిరేక కఠిన చర్యలను అమలు చేస్తామని హెచ్చరిస్తూ యురోపియన్ పార్లమెంట్ ఆ తీర్మానాన్ని ఆమోదించింది. పోలెండ్, బాల్టిక్ దేశాలు, రొమేనియాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 569ఓట్లు రాగా, 67మంది వ్యతిరేకించారు. 46 మంది గైర్హాజరయ్యారు. స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ నుండి రష్యాను తొలగించాలని, రష్యా చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని ఆ తీర్మానం ప్రతిపాదించింది.
రష్యా తన చర్యలతో ముందుకు సాగినట్లైతే ఇయులోని రష్యా అధికారుల, వారి కుటుంబ సుభ్యులకు చెందిన ఆస్తులను స్తంభింపచేస్తామని హెచ్చరించింది. మిన్క్స్ ఒప్పందాలను అమలు చేయాలని రష్యాని డిమాండ్ చేసింది. ఉక్రెయిన్లో పరిస్థితులకు మొత్తం బాధ్యతను రష్యాపై తోసివేస్తున్న ఆ తీర్మానం 2013, 14ల్లో ఉక్రెయన్ సంక్షోభాన్ని రెచ్చగొట్టడంతో అమెరికాకు సహకరించిన ఇయు పాత్రను ప్రస్తావించలేదు.