Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాలోకి ప్రవేశిస్తే ఐదేండ్ల జైలు
జెరూసలేం: కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్కు వెళ్లకుండా పలు దేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా సహా పలు దేశాలు భారత ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. తాజాగా ఇజ్రాయిల్ సైతం అదే బాటపట్టింది. తన పౌరులు భారత్ సహా మరో ఆరు దేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఆరు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో నిర్ణయం తీసుకున్నట్టు ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయిల్ పౌరులు ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా, భారత్, మెక్సికో, టర్కీ దేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఆంక్షలు ఈ నెల 3 నుంచి 16 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. అయితే, ఇజ్రాయిల్యేతర పౌరులు ఆయా దేశాలకు వెళ్లొచ్చనీ, అలాగే, ప్రస్తుతం ప్రయాణం కోసం విమానాశ్రయాల్లో వేచి ఉన్నవారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ ఏడు దేశాల నుంచి తిరిగివచ్చే వారు రెండు వారాల పాటు తప్పనిసరిగా కార్వంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది.
భారత్లోని ఆస్ట్రేలియన్లకు వార్నింగ్
భారత్లో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియన్ పౌరులు ఎవరైనా స్వదేశంలోకి ప్రవేశిస్తే గరిష్టంగా ఐదేండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా సైతం విధించనున్నారు. భారత్లో కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలను ఆస్ట్రేలియా నిషేధించింది. గత వారమే భారత్ నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. భారత్లో కరోనా బారినపడి క్వారంటైన్లో ఉన్నవారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయ తీసుకున్నట్టు ఆస్ట్రేలియా తెలిపింది. ప్రస్తుతం భారత్లో 9 వేల మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్టు అంచనా. వీరిలో 600 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఆస్ట్రేలియా పౌరులు తిరిగి స్వదేశానికి వస్తే వారిని నేరస్థులుగా పరిగణించడం ఇదే మొదటిసారి అని అక్కడి మీడియా పేర్కొంటోంది.