Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపసంహరించుకోవాలంటూ కొలంబియాలో భారీ నిరసనలు
- టియర్‌గ్యాస్,లాఠీలతో విరుచుకుపడ్డ భద్రతాబలగాలు
న్యూఢిల్లీ : కార్మిక దినోత్సవం సందర్భంగా శనివారం కొలంబియాలో భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. అక్కడి ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిన పన్ను సంస్కరణలపట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధ్యక్షుడు ఇవాన్ డాక్యూ ప్రభుత్వం అమల్లోకి తేవాలనుకుంటున్న పన్ను సంస్కరణల ప్రతిపాదనల్ని ఉపసంహరించుకోవాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో దేశమంతటా గత నాలుగురోజులుగా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రజా ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసుల్ని రంగంలోకి దింపింది. దాంతో పలు నగరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. శనివారంనాటి నిరసనల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారుల్ని అడ్డుకోవటం కోసం పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. టియర్‌గ్యాస్ ప్రయోగించారు. దేశంలో మూడో అతిపెద్ద నగరం కాలిలో నిరసనలు హోరెత్తుతున్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. ముగ్గురు నిరసనకారులు పోలీసుల తూటాకు బలయ్యారని జాతీయ మానవ హక్కుల అంబుడ్స్‌మన్ కార్లోస్ కామార్గో మీడియాకు వెల్లడించారు. మరో ముగ్గురు నిరసనకారులు కూడా చనిపోయారని, వీరి మృతికి గల కారణంపై విచారణ జరుగుతోందని కార్లోస్ కామార్గో తెలిపారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనల్లో ఇప్పటివరకూ 179మంది పౌరులు, పదుల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. కాలీ నగరంలో నిరసనకారులపై పోలీసులు పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు దిగారని, దీనివల్ల 14మంది చనిపోయారని స్థానిక మానవ హక్కుల గ్రూపులు ఆరోపిస్తున్నాయి.