Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : భారత్‌తో కొత్తగా రూ.10,200 కోట్ల వాణిజ్య ఒప్పందాన్ని బ్రిటన్ కుదుర్చుకుంది. దీనివల్ల బ్రిటన్‌లో కొత్తగా 6500 ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని పేర్కొంది. మంగళవారం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మెరుగైన వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం (ఇటిపి)లో భాగంగా పెట్టుబడులను బ్రిటన్ ధ్రువీకరించింది. 2030కల్లా బ్రిటన్-భారత్ వాణిజ్య విలువను రెట్టింపు చేయాలన్న ఆశయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. సమగ్ర ఉచిత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) దిశగా కసరత్తు ప్రారంభించాలనే ఉద్దేశ్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. బ్రిటన్-భారత్ సంబంధాల్లోని ప్రతి అంశం మాదిరిగానే ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ప్రజలను మరింత పటిష్టంగా, సురక్షితంగా చేస్తాయని జాన్సన్ పేర్కొన్నారు. 6,500కి పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయని, కరోనా దెబ్బ నుండి కోలుకుని కుటుంబాలు, కమ్యూనిటీలు ఈ ఉద్యోగాల వల్ల లబ్ది పొందుతాయని, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా ఉత్తేజితమవుతాయని అన్నారు. సంతకాలు జరిగి కొత్త భాగస్వామ్యం, సమగ్ర ఉచిత వాణిజ్య ఒప్పందం సాయంతో రాబోయే దశాబ్ద కాలంలో వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తామని జాన్సన్ ప్రకటించారు. కొత్త వాణిజ్య, పెట్టుబడుల ప్యాకేజీ కింద 53.3కోట్ల పౌండ్లు మేరకు బ్రిటన్‌లో భారత్ పెట్టుడులు పెడుతుంది. వీటిలో ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక రంగాలు ఉన్నాయి. వీటిల్లోనే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రిటన్‌లో పెట్టే 24కోట్ల పౌండ్లు కూడా వున్నాయి. వ్యాక్సిన్ వ్యాపారంలో వీటిని పెట్టనున్నారు. దీనివల్ల వంద కోట్ల విలువ చేసే కొత్త వ్యాపారం వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్, పరిశోధనా, అభివృద్ధి రంగాలకు సీరం పెట్టుబడులు సహకరిస్తాయి. బ్రిటన్‌కు, ఇతర ప్రపంచ దేశాలకు సాయపడేందుకు వ్యాక్సిన్ల తయారీకి కూడా అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. విద్యా రంగ సేవల్లో మరింత సహకారం అందించడానికి కూడా అంగీకారం కుదిరింది.