Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని అణచివేత చర్యలు
యాంగాన్ : మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చి...అధికారాన్ని చేజిక్కించుకున్న జుంటా సైన్యం మరోసారి వార్తా సంస్థలపై విరుచుకు పడింది. అక్కడ జరుగుతున్న హింసాకాండను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్న స్వతంత్ర వార్తా సంస్థలను కట్టడి చేసేందుకు శాటిలైట్ టివిని పూర్తిగా నిషేధించింది. శాటిలైట్ డిష్లను వాడే ఎవరిపైనైనా సరే భారీ జరిమానాలతో పాటు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఎవరైనా శాటిలైట్ డిష్లను వాడుతూ టివిలను చూస్తున్నట్లయితే 500,000 క్యాత్ (320 డాలర్స్) జరిమానా లేదా ఏడాది పాటు జైలు శిక్ష తప్పదని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ఇప్పటికే ప్రకటన చేసింది. కొన్ని అక్రమ సంస్థలు, వార్తా సంస్థలు..శాటిలైట్ ద్వారా ఇక్కడి భద్రతా దళాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయంటూ మిలటరీ ఆరోపించింది. అదేవిధంగా మీడియా, అంతర్జాలంపై నిబంధనలు విధించింది. డెమొక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా (డివిబి), మిజిమా వంటి స్వతంత్ర సంస్థలను లక్ష్యంగా చేసుకుని శాటిలైట్ టివిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టమౌతోంది. మార్చిలో వీటి లైసెన్సును జుంటా సైన్యం రద్దు చేసినప్పటికీ... శాటిలైట్స్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ నిషేధం కారణంగా విదేశీ వార్తా సంస్థలపై కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఈ నెల 4న రెండు వార్తా సంస్థలపై నిషేధం విధించింది. ఈ చర్యపై మానవ హక్కుల పరిశీలన లీగల్ అడ్వైజర్ లిండా లఖ్దీర్ తీవ్రంగా ఖండించారు. శాటిలైట్ టివి నిషేధం స్థానిక స్వతంత్ర దర్యాప్తు సంస్థలను అణచివేసి..ప్రజలను మరింత ఒంటరిని చేయాలని సైన్యం చూస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఈ చర్యను సైన్యం ఉపసంహరించుకోవాలని, న్యూస్ రిపోర్టింగ్పై దాడిని ముగించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని కూల్చివేసి... ప్రధాని అంగన్సూకీని అదుపులోకి తీసుకున్న జుంటా సైన్యం...తనను వ్యతిరేకిస్తున్న ప్రజల పట్ల దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 71 మంది జర్నలిస్టులను అరెస్టు చేయగా...48 మందిని నిర్బంధించింది.