Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: కరోనా దెబ్బకు అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు, ఇక్కడకు వచ్చి తిరిగి వెళ్ళాల్సినవారికి కష్టాలు మొదలయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా.. అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి. అటువంటి పరిస్థితిలో, హెచ్ -1 బీ వీసాలు ఉన్న వారికి రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి- ఉద్యోగ కాలం పొడిగించుకోవటం..., రెండోది - యూఎస్ వదిలి వెళ్లటం. వీసాల కోసం గ్రేస్ పీరియడ్ పొందినా.. అక్కడి నిబంధనల ప్రకారం మరోచోట ఉద్యోగం పొందటం తప్పనిసరి. కానీ అంటువ్యాధి ప్రబలటంతో ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అందువల్ల ప్రవాసభారతీయులకు అక్కడి ఉద్యోగం దొరకటం సాధ్యంకావటంలేదు. దీంతో అలాంటి ప్రవాసీయులు అమెరికాను విడిచివెళ్లాల్సివస్తున్నది.
సామాన్లు అమ్ముకోకతప్పటంలేదు...
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది హెచ్-1బీ వీసాలపై పనికోసం యూఎస్‌కు చేరుకుంటారు. వారిలో భారతీయుల సంఖ్య అత్యధికం. అక్కడ ఉద్యోగం పోయాక.. వారి పడకలు, సోఫాలు, ఇతర వస్తువులను అమ్ముకోవాల్సివస్తున్నది. గతేడాది పెద్ద సంఖ్యలో అక్కడ నిరుద్యోగులుగా మారారు. దీంతో వీసా పొడిగింపును తిరస్కరిస్తున్నట్టు ఓ భారతీయ ఇంజనీర్ తెలిపారు.
యూఎస్‌లో భారత రాయబార కార్యాలయం బంద్
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా భారతదేశంపై అమెరికా ప్రయాణ నిషేధం విధించింది. ఈ కారణంగా వలసదారులు ఇక్కడ, అక్కడ చిక్కుకున్నారు. ప్రయాణ నిషేధం ఎంతకాలం ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. భారతదేశంలో యూఎస్ కాన్సులేట్లు కూడా మూసివేశారు. అందువల్ల ఇక్కడ చిక్కుకున్న ప్రవాసీ యులు ఎలాంటి సమాచారం పొందలేకపోతున్నారు. 'తన తండ్రి అంత్యక్రియల కోసం నా భర్త భారతదేశానికి వెళ్ళాడు.. నేను నా ఇద్దరు కుమార్తెలతో అమెరికాలో ఉన్నాను. ఆయన ఎప్పుడో వస్తారో అర్థం కావటంలేదు' అని అమెరికాలోని స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ సహ వ్యవస్థాపకురాలు నేహా మహాజన్ అన్నారు. 2013 నుంచీ ఉత్కర్ష్ హజార్నిస్ యూఎస్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌కు వచ్చిన ఆయన ఇక్కడే ఉండిపోయారు. కాన్సులేట్ మూసివేయడం వల్ల వారి హెచ్ -1 బీ వీసా స్టాంప్ వేయలేదు. ఈ కారణంగా తన ఉద్యోగం ప్రశ్నార్థకంగా మారిందని ఆయన వాపోయారు. ముంబయిలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మూసివేశారు. స్టాంపింగ్ కోసం ముంబయి వచ్చిన అభినవ్ అమ్రేష్ అమెరికాకు వెళ్లలేకపోయాడు. ముంబయిలోనే చిక్కుకున్నాడు. ఇలా చాలామంది యూనైటెడ్ స్టేట్స్కు తిరిగి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఓవైపు ట్రావెల్‌బ్యాన్, మరోవైపు ఎంబసీలు మూసివేయటంతో భారీసంఖ్యలో ప్రయాణికులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. యూఎస్, భారత్ ప్రభుత్వాలు చొరవచూపితే పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.