Authorization
Mon Jan 19, 2015 06:51 pm
90 మందికి గాయాలు
జెరూసలేం : వేలాది మంది పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ పోలీసులు విరుచుకుపడ్డారు. వరుసగా రెండో రోజు శనివారం జరిగిన ఈ హింసాకాండలో 90 మందికి పైగా పాలస్తీనియన్లకు గాయాలయ్యాయి. తూర్పు జెరూసలేంకు చెందిన ఓల్డ్ సిటీకి వెలుపల ఈ దాడి చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పరిస్థితులు మరింత అదుపుతప్పే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లాం పవిత్రమైన లయలత్ అల్ ఖదర్ లేదా ముస్లిం ఉపవాస మాసం సందర్భంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అల్-అక్సా మసీదు వద్ద వేలాది మంది ముస్లిములు ప్రార్థనలు చేశారు. తూర్పు జెరూసలేం పరిధిలోని షేక్ జర్రా ప్రాంతంలో నివాసం ఉంటున్న పాలస్తీనియన్ కుటుంబాలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ వేసింది. ఈ ప్రాంతాన్ని అక్రమంగా నివాసం ఉంటున్న యూదులు తమదిగా పేర్కొంటున్నారు. ఇజ్రాయిల్ అక్రమ ప్లాన్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ పోలీసులు పాలస్తీనియన్లపై గ్రెనేడ్లు, వాటర్ కెనాన్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతిఘటనగా పాలస్తీనియన్ ఆందోళనకారులు రాళ్లు విసిరడంతో పాటుగా, ఓల్డ్ సిటీ వైపునకు వెళ్లే మార్గాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్లను విరగొట్టారు. ఆదివారం ఇజ్రాయిలీలు జెరూసలేండే నిర్వహించనున్న నేపథ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.