Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాసిజంపై విజయానికి గుర్తుగా..
- పాల్గొన్న వేలాదిమంది సైనికులు
మాస్కో: రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫాసిజంపై సోవియట్ యూనియన్ రెడార్మీ సాధించిన విజయానికి గుర్తుగా రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌స్క్వేర్ స్మారకం వద్ద ఆదివారం సైనిక పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. 12 వేల మందికి పైగా సైనికులు, మిలటరీ పోలీస్ అధికారులు, నేషనల్ గార్డ్స్మెన్, క్యాడెట్లు రెడ్‌స్క్వేర్ వైపునగా మార్చ్ చేపట్టారు. అంతకుముందు యుద్ధంలో చనిపోయిన రెడార్మీ వీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. జర్మనీ నాజీలపై సాధించిన విజయానికి గుర్తుగా గతేడాది నిర్వహించిన 75 సంవత్సరాల విజయోత్సవాల కంటే కరోనా నేపథ్యంలో తక్కువమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ రెండో ప్రపంచయుద్ధంలో సోవియట్ యూనియన్ సాధించిన విజయం మొత్తం ప్రపంచ గతినే మార్చిందన్నారు. సోవియట్ ప్రజలు చేసిన ఈ గొప్ప పోరాటాన్ని తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు. సోవియట్ ప్రజల్లోని ఐక్యత, ధైర్యం ఫాసిస్టు హిట్లర్, నాజీలను ఓడించి అసాధ్యమనుకున్న దాన్ని కూడా సుసాధ్యం చేసిందని పుతిన్ అన్నారు. పరేడ్ సందర్భంగా రష్యా తన ఆయుధ సంపదను ప్రదర్శించింది. 190 రకాల ఆయుధాలను రెడ్‌స్క్వేర్ వద్ద ప్రదర్శనకు ఉంచింది. వీటిల్లో కొత్తగా తయారుచేసిన టి90ఎం ప్రోరివ్, టి-14 అర్మత యుద్ధ ట్యాంకు, కుర్గానెట్స్-25 పదాతిదళ యుద్ధ వాహనాలు, నేలపై, నీటిపై తిరిగే బూమేరాంగ్ సాయుధ సిబ్బంది వాహనాలు ఉన్నాయి. రిమోట్ నియంత్రణతో నడిచే ఉరాన్-9 రోబో ట్యాంకులను కూడా సైన్యం ఈ సందర్భంగా ప్రదర్శించింది. టైపూన్-పీవీఓ సాయుధ వాహనాలు మొదటిసారిగా పరేడ్‌లో పాల్గొన్నాయి. వీటితో పాటు ఇస్కాందర్-ఎం స్వల్పశ్రేణి క్షిపణులు, ఎస్-600 క్షిపణి వ్యవస్థను కూడా రష్యా పరేడ్‌లో ఉంచింది.