Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్ అక్సా మసీదు వద్ద ఇజ్రాయిల్ దాడులు
- గాజాలో 20మంది మృతి
జెరూసలేం : ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంలో సోమవారం కూడా ఇజ్రాయిల్ దారుణ హింసకు పాల్పడింది. ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న తూర్పు ప్రాంతంలో పాలస్తీనియన్లను బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అల్ అక్సా మసీదు ఆవరణపై ఇజ్రాయిల్ పోలీసులు సోమవారం ఉదయమే విరుచుకుపడ్డారు. స్టన్ గ్రెనెడ్లు, బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. సమీపంలోని రోడ్డు పై నుండి పాలస్తీనా నిరసన ప్రదర్శకులు రాళ్లు విసిరారని పోలీసులు చెప్పడంతో సమస్య ప్రారంభమైంది. షేక్ జారా ప్రాంతం నుంచి వైదొలగడానికి ఇజ్రాయిల్ అధికారులు తిరస్కరించడంతో హమస్ వారిపైకి రాకెట్లు ప్రయోగించింది. అనేక వందల రాకెట్లు ప్రయోగించగా, వాటిల్లో చాలావాటిని ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ అడ్డగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ మిలటరీ బలగాలు వైమానిక దాడులు జరిపాయి. గాజాలో ఎనిమిదిమంది హమస్ తీవ్రవాదులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. కానీ గాజాలో 20మంది మరణించారనీ, వీరిలో తొమ్మిదిమంది పిల్లలు కూడా వున్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు.
ఈ హింసను జర్మనీ విదేశాంగ మంత్రి హెకో మాస్ ఖండించారు. మరింతమంది ప్రజలు మరణించకుండా వుండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇజ్రాయిల్, పాలస్తీనా అధికారులపై వున్నదన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ హమస్ జరిపిన రాకెట్ల దాడిని ఖండించారు. తక్షణమే దాడులను ఆపాలని ఆ గ్రూపును డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ చర్యలపై పోరాడతామని టర్కీ ప్రకటించింది. పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌కు, హమాస్ చీఫ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయిల్ పాలస్తీనియన్లను రెచ్చగొడుతోందని పాలస్తీనా నేత డాక్టర్ హనన్ వ్యాఖ్యానించారు.
దాడులకు సీపీఐ(ఎం) ఖండన
పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ దాడులను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా నిరసించింది. గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయిల్ సాగించిన వైమానిక దాడుల్లో పలువురు పాలస్తీనా పౌరులు మరణించారు. యూదు ఆవాసాలకు మార్గం కల్పించేందుకు గానూ పొరుగునే గల షేక్ జారా ప్రాంతంలోని ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలను నిరసిస్తున్న పాలస్తీనియన్లపై దాడికి దిగడం ద్వారా తూర్పు జెరూసలేంను పూర్తిగా ఆక్రమించే దిశగా ఇజ్రాయిల్ అడుగులు వేస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ముస్లింలకు మూడో పవిత్ర ప్రాంతమైన అల్ అక్సా మసీదు ఆవరణపై ఇజ్రాయిలీ బలగాలు దాడి చేశాయి. రంజాన్ మాసంలో మసీదు లోపల ప్రార్ధనలు చేసుకుంటున్న వందలాదిమంది ముస్లింలు గాయపడ్డారు. తన సంకుచిత స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం నెతన్యాహు ఈ దాడులకు పాల్పడున్నారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఇజ్రాయిల్ ఎన్నికల్లో మెజారిటీ సాధించడంలో నెతన్యాహు పదే పదే విఫలమవుతున్నారు. కొవిడ్ మహమ్మారి నుండి ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ తరహా చర్యలకు దిగుతున్నాడని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న పాలస్తీనియన్ల పట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నారనీ, వారికి వ్యాక్సిన్లు కూడా అందడం లేదని పేర్కొంది. ఇటువంటి చర్యలతో ఇజ్రాయిల్ అనుసరిస్తోన్న వర్ణ వివక్ష విధానాలు బట్టబయలవుతున్నాయని వ్యాఖ్యానించింది. మానవ హక్కులను ఉల్లంఘించేలా ఇజ్రాయిల్ చర్యలు వున్నాయనీ, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన పలు తీర్మానాలకు విరుద్ధంగా వున్నాయని పేర్కొంది. ఈ చర్యలను సీపీఐ(ఎం) ఖండించింది. పాలస్తీనా ప్రజలకు మద్దతిస్తూ తమ వాణి వినిపించాల్సిందిగా దేశ ప్రజలను కోరింది.