Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబులు, రాకెట్లతో ఇజ్రాయిల్ దాడులు
- 48కి పెరిగిన మృతులు
జెరూసలేం : గాజాపై మంగళవారం రాత్రంతా భారీగా జరిగిన బాంబు దాడులు బుధవారం ఉదయానికి కూడా కొనసాగాయి. పెద్ద పెద్ద పేలుళ్ల శబ్దాల తో పశ్చిమ గాజా ప్రాంతం దద్దరిల్లింది. దిగ్బంధించిన తీర ప్రాంతం పొడవునా వివిధ ప్రదేశాల్లో ఇజ్రాయిలీ బలగాలు ముమ్మరంగా దాడులు చేపట్టాయి. పాల స్తీనా సాయుధ గ్రూపులకు చెందిన ప్రాంతాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు బాంబులతో దాడి చేస్తున్నాయి. దీనికి తోడు పాలస్తీనా భద్రతా, పోలీసు భవనాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోని అన్ని పోలీసు భవనాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయని హమస్ తెలిపింది. 13అంతస్తుల టవర్‌పై రాత్రంతా దాడులు జరిపామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఈ టవర్‌లో హమస్ మిలటరీ, ఇంటెలిజెన్స్ వర్గాల కార్యాలయాలు, సీనియర్ సభ్యులు వున్నారు. హమస్కి చెందిన కీలక ప్రతినిధుల ఇళ్ళపై కూడా దాడులు జరిగాయి. తాజాగా దాడులు ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 48మంది మరణంచారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 14మంది పిల్లలున్నారు. మరో 300మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ఆరుగు ఇజ్రాయిలీలు కూడా మరణించారు. ఇజ్రాయిల్ మిలటరీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని హమస్ దాడి జరపడంతో ఒక ఇజ్రాయిల్ సైనికుడు చనిపోయాడు. గాజా నుంచి ఇజ్రాయిల్‌లోని వివిధ ప్రాంతాలపై 1500 రాకెట్లు పడ్డాయని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఈదాడులను నిలుపుచేయడానికి నిర్దిష్టమైన తేదీ అంటూ లేదని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి బెన్నీ గంట్జ్ చెప్పారు. పూర్తిగా ప్రశాంతత నెలకొనేవరకు ఈ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాజాలో టవర్లు కూలిపోతున్నాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, సొరంగాలను తవ్వేశారు, కమాండర్లను చంపేస్తున్నారు. కానీ ఇజ్రాయిల్ దురాగతాలను తీవ్రంగా ఖండించే రీతిలో అంతర్జాతీయ సమాజం ఇంకా ప్రతిస్పందించడం లేదని పాలస్తీనా విమోచన సంస్థ (పిఎల్ఓ) ఎగ్జిక్యూటివ్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.
మేం కూడా సిద్ధమే : హమస్
సమస్య హమస్ వద్ద లేదని, ఇజ్రాయిల్ వద్ద వుందని హమస్ నేత ఇస్మాయిల్ హనియా వ్యాఖ్యానించారు. వారు దాడులకే సిద్ధమైతే మేం కూడా అందుకు రెడీగానే వున్నాం, వారు శాంతిని కోరుకుంటే మేం కూడా శాంతినే కాంక్షిస్తామని చెప్పారు.
సంయమనం పాటించండి : బ్రిటన్
ఇరు పక్షాల మధ్య తాజాగా హింస పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో వెనక్కి మళ్ళి ఇరు వర్గాలు సంయమనం పాటించాలని బ్రిటన్ కోరింది. తాజా పరిణామాల పట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. తక్షణమే ఈ ఉద్రికత్తలను తగ్గించాల్సిన అవసరముందని అన్నారు.
ఇజ్రాయిల్ దాడిలో కేరళవాసి మృతి
ఇజ్రాయిల్‌లో జరిగిన మోర్టార్ దాడిలో కేరళకు చెందిన సౌమ్య సంతోష్ మరణించారు. తన భర్తతో వీడియోకాల్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆమెను మోర్టారు గుండ్లు తాకాయి. మోర్టార్ల శబ్దం వినిపించగానే తాను ఇంట్లోని బంకర్లోకి వెళ్ళాలనీ, మళ్ళీ ఎప్పుడు మాట్లాడతానో తెలియదని భర్తతో అన్నారు. ఇలా అంటుండగానే ఫోన్ కట్ అయింది. ఏం జరిగిందో వెంటనే తెలియరాలేదు.