Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికలు రూపొందిస్తున్న ఇజ్రాయిల్ బలగాలు
- హమస్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు నెతన్యాహు 'నో'
- 71కి చేరిన మృతులసంఖ్య
జెరూసలేం : హమస్ రాకెట్ల దాడులకు ప్రతిగా గాజాపై పదాతి దళాలతో దండెత్తేందుకు ఇజ్రాయిల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా, పరస్పర అంగీకార ప్రాతిపదికనన ఘర్షణలకు స్వస్తి పలుకుదామన్న హమస్ ప్రతిపాదనను ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. గాజా సరిహద్దుల వద్దకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. వీరిలో మూడు బ్రిగేడ్లకు చెందిన సైనికులు వున్నారని ఐడీఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హిదారు జిల్బర్మన్ గురువారం విలేకర్లకు తెలిపారు. గాజాపై దండయాత్రకు అనుసరించే ప్రణాళికను త్వరలో ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ అవివ్‌కు అందచేయనున్నట్టు చెప్పారు. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధంగా వున్నామన్నారు. ఐడీఎఫ్ ఇప్పటికే సూత్రప్రాయంగా పదాతిదళ పోరాటానికి వివిధ రకాల ప్రణాళికలకు ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. అయితే సరిహద్దును దాటేందుకు ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అల్ అక్సా మసీదులో బలవంతపు చర్యలను నిలువరించేందుకు ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెచ్చినట్లైతే పరస్పర అంగీకార ప్రాతిపదికన ఇజ్రాయిల్‌పై దాడులను నిలిపివేస్తామని హమస్ ప్రకటించింది. అయితే నెతన్యాహు అందుకు తిరస్కరిస్తూ, ఇజ్రాయిలీలపై దాడులు చేసినందుకు వారు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. దీనిపై హమస్ మిలటరీ వింగ్చీఫ్ కూడా ఇదే తరహాలో హెచ్చరిక చేశారు. ఈ నెల 10నుండి ఇప్పటివరకు ఇజ్రాయిల్ నగరాలపై 1500కి పైగా రాకెట్లను హమస్ ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది. దీంతో చాలామంది బాంబు షెల్టర్లలో దాక్కోవాల్సి వస్తోందన్నారు. ఆరుగురు పౌరులు మరణించారని చెప్పారు. దీనికి ప్రతిగా గాజాలో 650లక్ష్యాలపలై ఇజ్రాయిల్ బాంబు దాడులు జరిపింది. అనేక పలు అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. డజన్ల సంఖ్యలో హమస్ కార్యకర్తలు మరణించారు. గురువారానికి 17మంది పిల్లలతో సహా 71మంది పాలస్తీనియన్లు మరణించారు.