Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనాన్షియల్ టైమ్స్ వ్యాఖ్య
లండన్ : భారత్లో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ సంక్షోభం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట క్షీణించిందని లండన్ ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. కోవిడ్ సెకండ్ వేవ్ సంకేతాలు పట్టించుకోలేదని, తమ బాధలు, ఇబ్బందుల పట్ల ప్రధాని మోడీ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన వార్తా కథనం పేర్కొంది. ఈ మేరకు గురువారం 2,300 పదాలతో కూడిన వార్తా కథనాన్ని ప్రచురించింది. కొవిడ్ సంక్షోభాన్ని భారత ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొనలేకపోయిందంటూ మోడీని ఉద్దేశించి విదేశీ వార్తా మాధ్యమాల్లో వస్తున్న విమర్శలు, ప్రచారాన్ని ప్రతిఘటించడాన్ని కూడా భారత ప్రభుత్వం విరమించినట్లు కనిపిస్తోందని ఆ వ్యాసం పేర్కొంది. మరోపక్క ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బిజెపి ఎన్నికల కుయుక్తులన్నింటినీ ఎదుర్కొని గెలిచిన మమతా బెనర్జీ విజయం పట్ల ప్రాంతీయ పార్టీలన్నీ ఉత్సాహంగా వున్నాయి.
సాధారణ ప్రజానీకం నుండి ముఖ్యుల వరకు అందరి అనుభవాలకు ఈ వ్యాసంలో చోటు కల్పించారు. ఢిల్లీలో సకాలంలో చికిత్సనందించలేక తమ 67 ఏళ్ల తండ్రిని కోల్పోయామని అనర్య(30) ఆవేదనను కూడా ఆమె మాటల్లోనే వెల్లడించింది. ''మందులు ఎక్కడున్నాయి, ఆక్సిజన్ వుందా లేదా, ఐసియు బెడ్ దొరుకుతుందా లేదా ఇవన్నీ మా పనులు కావు, ఒక ఆస్పత్రి నుండి మరో ఆస్పత్రికి తిరుగుతునే వున్నాం. అలా జరగకూడదు. కానీ జరిగింది, మేం పన్నులు కడుతున్నాం. అటువంటప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వారు వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారు. ఇది నేరపూరితమైన నిర్లక్ష్య ధోరణి తప్ప మరొకటి కాదు.'' అని ఆమె తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అనర్య ఒక్కరే కాదు, ఇలా బాధతో, ఆక్రోశంతో, ఆవేదనతో ప్రశ్నించేది. కొన్ని వేల గొంతుకలు ఇలాగే ప్రశ్నిస్తున్నాయి. పట్టణ భారతంలో చాలా ఉద్విగభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. తమ ప్రియతములకు వైద్యం చేయించడం కోసం వారు యుద్దాలే చేయాల్సి వస్తోంది. కోవిడ్ సంక్షోభం ఇంతలా వున్నా వ్యాక్సిన్ల కోసం పోరాటాలే చేస్తున్నారు.
గత కొద్ది వారాల కిందట వరకు రాజకీయంగా ఎవరూ ఎదుర్కొన లేని రీతిలో అత్యంత శక్తివంతమైన, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక ప్రజాదరణ పొందిన ప్రధానిగా నరేంద్ర మోడీ వున్నారు. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహంతో మోడీ చరిష్మాకు బీటలు పడ్డాయి. ''మోడీ ఇప్పుడు మసకబారిన నేతగా కనిపిస్తున్నారు. దేశ స్వాతంత్య్రం తదనంతర కాలంలో దేశం ఇంతటి విపత్తును ఎన్నడూ ఎదుర్కొనలేదు. అయినా ఈ పరిస్థితులను చూస్తూ కూర్చున్నారు. ఉద్యోగాలు సృష్టిస్తామని, ఆర్థికాభివృద్ధి పెంచుతామని, ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను పెంచుతామని చేసిన హామీలన్నీ నీరుగారిపోయాయి. అందుకు బదులుగా చాలామంది ప్రజలు తమవారిని బతికించుకోవడానికి పోరాటాలు సల్పుతున్నారు.
మోడీకి దీర్ఘకాలంలో ఎదురవబోయే రాజకీయ పర్యవసానాలను విశ్లేషించడానికి కూడా ఈ వ్యాసంలో ప్రయత్నం జరిగింది. ''కరోనా మహమ్మారిని మోడీ ఎదుర్కొన్న తీరుకు సంబంధించి కఠిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా ముప్పు తొలగినట్లేనని సూచించేలా ప్రజలకు సందేశాన్ని పంపడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. సెకండ్ వేవ్ తలెత్తే అవకాశం వుందని జాగ్రత్తగా వుండాలని పదే పదే నిపుణులు హెచ్చరించినా వాటిని పెడచెవిన పెట్టారు. వ్యాక్సిన్లను సమకూర్చుకునే వ్యూహాన్ని కూడా సక్రమంగా రూపొందించలేదు. ఫలితంగా దేశంలో తీవ్రంగా వ్యాక్సిన్ కొరత నెలకొంది. మార్చి చివరి నుండి మోడీ పేరు ప్రతిష్టలు దిగజారడం ప్రారంభించాయి. ఆనాడు ప్రజల అప్రూవల్ రేటు 74శాతంగా వుండగా విభేదించేవారు కేవలం 20శాతంగా వున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. వచ్చేఏడాది జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలు మోడీ పనితీరుకు ఒక పరీక్షగా నిలుస్తాయని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. కరోనా సంక్షోభం పట్ల బిజెపి పనితీరు ఎలా వుందో ఓటర్ల అభిప్రాయం ఆ ఎన్నికల్లో తేలిపోతుందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతమున్న ఇబ్బందులన్నింటినీ మోడీ అధిగమించేస్తారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా పరిస్థితులు, విషయాలు మారతాయి, కానీ మరిన్ని విషయాలు, పరిస్థితులు అలాగే కొనసాగుతాయని చివరిలో ఫైనాన్షియల్ టైమ్స్ తన వ్యాసంలో వ్యాఖ్యానించింది.