Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందమందికిపైగా మృతి, భూతల దాడుల్లేవన్న సైన్యం
జెరూసలెం : గాజాపై ఇజ్రాయిల్ తన భీకర దాడులను మరింత ఉధృతం చేసింది. దీనికి ప్రతిగా హమాస్ టెల్ అవీవ్‌పై రాకెట్ దాడులు సాగించింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న వైమానిక దాడుల్లో ఇప్పటివరకు వంద మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాపై తమ బలగాలు భూతల దాడులకు సైన్యం సిద్ధమైనట్లు వచ్చిన వార్తలను ఆర్మీ గురువారం తోసిపుచ్చింది. పదాతిదళాల దాడి యోచనేదీ లేదని అంటూనే సరిహద్దుకు సమీపంలో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. గాజాపై పెద్ద పెద్ద యెత్తున మంటలు విరజిమ్ముతూ కొనసాగుతున్న బాంబు దాడులతో శుక్రవారం భయానక వాతావరణం నెలకొంది. కాగా, సమస్యను పరిష్కరించడానికి ఆదివారం భద్రతా మండలి సమావేశమవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ జరిపి, ఉద్రిక్త్తతలు తగ్గించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పిలుపిచ్చారు. ఇప్పటికే అమాయకులైన పలువురు మరణించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘర్షణలు ఈ ప్రాంతంలో సమస్య మరింత జటిలం కావడానికే దారి తీస్తాయని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ వీధుల్లో హింస పట్ల ఆందోళన చెందుతున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. హింసాకాండ కారణంతో పలు అంతర్జాతీయ విమాన సంస్థలు ఇజ్రాయిల్‌కు విమానాలు రద్దు చేశాయి. వివిధ రకాల యుద్ధాలకు తమ దేశం సన్నద్ధంగా వుందని అందులో పదాతిదళ దాడి ఒకటని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి జాన్ వ్యాఖ్యానించారు. ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చని హమస్ హెచ్చరించడంతో గాజాలో ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి బంకర్లలో తల దాచుకుంటున్నారు. ఘర్షణలు ఎక్కడా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఇజ్రాయిల్‌లో హింస చోటు చేసుకుంటోంది. అరబ్బులు, యూదులపై దాడులు జరుగుతున్నాయి. పోలీసు స్టేషన్లపై దాడులు చేస్తున్నారు. అంతర్గతంగా చెలరేగుతున్న అశాంతిని అణచివేసేందుకు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించాలని రక్షణ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.