Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలెం : గాజా వైపు నుండి ఇజ్రాయిల్‌పైకి దూసుకువస్తున్న రాకెట్ల వర్షాన్ని తమ 'ఐరన్ డోమ్' రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంటుందని ఐడిఎఫ్ బలగాలు తెలిపాయి. హమస్ ప్రయోగించే రాకెట్లను గాల్లోనే అడ్డుకుని నిర్వీర్యం చేయడం ఈ ఐరన్ డోమ్ విశిష్టత. అసలీ ఐరన్ డోమ్ లేదా ఉక్కు గొడుగు అంటే ఏమిటి? 70 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే స్వల్ప శ్రేణి రాకెట్లను, శతఘ్నులు, మోర్టార్లను, హెలికాప్టర్లను, విమానాలను అడ్డుకోగలిగే బహుముఖ వ్యవస్థ ఇది. ఒకేసారి పలు వైపుల నుండి వచ్చే లక్ష్యాలను సమర్ధవంతంగా తిప్పికొట్టగలుగుతుంది. భూమి మీద, సముద్రంపై కూడా దీన్ని మోహరించవచ్చు. రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, రక్షణ శాఖ సంయుక్తంగా తయారు చేసిన ఈ ఉక్కు గొడుగు 2011 నుండి ఇజ్రాయిల్ వైమానిక బలగాల్లో సేవలందిస్తోంది. ఈ ఐరన్ డోమ్‌లో కంట్రోల్ యూనిట్, డిటెక్షన్, ట్రాకింగ్ రాడార్లు, ఫైరింగ్ యూనిట్ వుంటాయి. ముందుగా వచ్చే రాకెట్ దిశను రాడార్ ద్వారా గుర్తించి అది జనావాసాలపై పడుతుందనుకుంటే ముందుగానే కూల్చివేస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో పడి ఎలాంటి నష్టం కలిగించని రాకెట్లను ఇది అడ్డుకోదు. ఇప్పటివరకు వేలాది రాకెట్లను విజయవంతంగా అడ్డుకున్న ఈ వ్యవస్థ సక్సెస్ రేటు 90శాతానికి పైగా వుందని రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ పేర్కొంది. అన్ని విడిభాగాలను ఒకే ట్రక్కులో పెట్టుకుని ఎక్కడికైనా ఈ ఐరన్ డోమ్‌ను తీసుకెళ్లవచ్చు. నౌకల్లో మోహరించేందుకు వీలుగా సి-డోమ్ కూడా వుంది. అయితే ఈ వ్యవస్థకు కూడా కొన్ని పరిమితులున్నాయి.