Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనోరు : మొదటి రౌండ్ గ్లోబల్ వ్యాక్సినేషన్‌తో కోవిడ్-19తోపాటు ఇతర వేరియంట్ల నుంచి తగిన రక్షణ వస్తుందన్న దానికి ఆధారాలు పెరుగుతున్నాయని డజన్ మందికి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, అంటువ్యాధుల నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సంవత్సరం వారీగా బూస్టర్ షాట్లు, కొత్త వ్యాక్సిన్లు తయారు చేసేందుకు పలు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ప్రణాళికలు వేసుకుంటున్న తరుణంలో బూస్టర్ల అవసరం ఉందా అని ఉన్నత శాస్త్రవేత్తలు సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రతిఏటా కరోనాకు సంబంధించి బూస్టర్ షాట్లపై ప్రజల అంచనాలను ఫార్మా కంపెనీలే నిర్దేశిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ముందస్తు జాగ్రత్లలు తీసుకోవడం మంచిదేనని పలువురు అంగీకరించినట్లు రాయిటర్స్ మీడియా సంస్థ పేర్కొంది. బూస్టర్ డోసు అవసరమా కాదా అనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే సమగ్ర డేటా ఇప్పటి వరకు అందుబాటులో లేదనిప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఒ)కు చెందిన ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ అండ్ బయోలాజికల్స్ విభాగ డైరెక్టర్ కేట్ ఓబ్రియన్ అన్నారు. రాయిటర్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇది పేద దేశాలకు పెను భారంగా మారుతుందన్నారు. అసలు ఈ బూస్టర్ డోస్‌లు ఇప్పుడు అంత అవసరమా అని వారు ప్రశ్నించారు.
ఫైజర్ కంపెనీ సిఇఒ అల్టెర్ట్ బౌర్లా మాట్లాడుతూ ప్రతి 12 నెలలకోసారి ప్రజలు బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో బూస్టర్లు అవసరమని భావిస్తున్నామని, ఒకసారి వైరస్ నియంత్రణలోకి వచ్చిన తరువాత ఇది మారే అవకాశం ఉందని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. పలు ప్రాంతాల్లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ బూస్టర్లు అవసరమని భావిస్తున్నామని మోడెర్నా కంపెనీ సిఇఒ బాన్సెల్ పేర్కొన్నారు.