Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరుగురు పిల్లలతో సహా 12మంది మృతి
జెరూసలేం : గాజాలోని శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 12మంది మరణించారు. వీరిలో ఆరుగురు పిల్లలు కాగా ఇరువురు మహిళలు. మరో 15మంది గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు గత రాత్రంతా దాడులను కొనసాగిస్తునే వున్నాయి. శనివారం తెల్లవారు జామున అల్ షాటి శరణార్ధ శిబిరంపై ఐడిఎఫ్ బలగాలు మూడు బాంబులను వేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 12గా నిర్ధారించినా ఇంకా పెరిగే అవకాశముందని శిధిలాల కింద చాలామంది వున్నారని భావిస్తున్నామని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దాడులు చేయడానికి ముందుగా ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ దాడి జరిగిన వెంటనే హమస్ కూడా ఎదురు దాడి ప్రారంభించింది. వరుసగా రాకెట్ల వర్షాన్ని కురిపించింది. ఒకపక్క శరణార్ధుల శిబిరంపై దాడి చేసి ఇంతమందిని పొట్టనబెట్టుకున్నా ఐడిఎఫ్ బలగాలు దాని గురించి మాట్లాడటం లేదు. పైగా రాకెట్ ప్రయోగ కేంద్రాలు, ఇతర సైనిక లక్ష్యాలపైనే తమ దాడులని చెబుతున్నాయి. ఈ పేరుతో దాడులు జరుపుతూ పౌరు నివాసాలపై కూడా అక్రమంగా దాడులకు తెగబడుతోంది. మసీదును కూడా ధ్వంసం చేశారని పాలస్తీనా మత వ్యవహరాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేలాదికిలోమీటర్ల పొడవైన సొరంగాలు, రాకెట్ లాంచ్ కేంద్రాలు, ఆయుధ తయారీ గోదాములపై శుక్రవారం రోజంతా ఇజ్రాయిల్ బలగాలు దాడులను కొనసాగిస్తునే వున్నాయి. కాగా సోమవారం నుండి తాజాగా హింస ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 2వేలకు పైగా రాకెట్లు హమస్ పయోగించిందని చెబుతోంది. గాజాలోని మధ్యధరా సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో వున్నందున అల్ షాటి శరణార్ధ శిబిరాన్ని బీచ్ క్యాంప్‌గా పిలుస్తారు. కేవలం అరకిలోమీటరు విస్తీర్ణంలో ఇక్కడ 86వేల మంది శరణార్దులు నివసిస్తున్నారు. భూమిపై అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఇదొకటిగా ఐక్యరాజ్య సమితి పేర్కొంటోంది. కాల్పుల విరమణ పాటించాలని అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తులు చేసినా ఇజ్రాయిల్ పెడచెవిన పెడుతోంది. వరుసగా ఆరో రోజూ దాడులను కొనసాగించింది. ఇప్పటివరకు 36మంది పిల్లలు, 21మంది మహిళలతో సహా 137మంది పాలస్తీనియన్లు మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. స్థిరమైన ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా కసరత్తు చేయాల్సిన అవసరం వుందని ఇజ్రాయిల్‌లోని అమెరికన్ ఎంబసీ వ్యాఖ్యానించింది.
మరోవైపు కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్ ప్రయత్నిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా కాల్పులు విరమించాలంటూ కోరింది. ఈజిప్ట్, కతార్, ఐక్యరాజ్య సమితికి చెందిన మధ్యవర్తులు పరిస్థితిని చక్కబరిచేందుకు అన్నివైపుల నుండి కృషి చేస్తున్నారని, కానీ ఇంతవరకు ఒప్పందం కుదరలేదని పాలస్తీనా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.