Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200కి చేరిన మొత్తం మృతులు
- అమెరికా, యూరోప్ అంతటా నిరసనలు
జెరూసలెం : గాజాపై ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 42మంది మరణించారు. గత వారం ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించిన తర్వాత ఒక్క రోజులో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. గాజాపై దాడులు ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 200మంది మరణించారు. వీరిలో 52మంది పిల్లలు, 33 మంది మహిళలు ఉన్నారు. మరో 1200మంది గాయపడ్డారు.
గాజాపై ఇజ్రాయిల్ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా అమెరికా, యూరపు అంతటా నిరసనలు హోరెత్తాయి. చికాగో, న్యూయార్క్, లండన్, పారిస్, బెర్లిన్, మాడ్రిడ్‌తో సహా పలు ముఖ్యమైన నగరాల్లో వేలాది మందితో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. 1948 నుంచి ఇప్పటివరకు 7,60,000 మంది పాలస్తీనీయులను తమ ఇళ్ల నుంచి, సొంత గ్రామాలనుంచి దౌర్జన్యంగా ఖాళీ చేయించిన ఇజ్రాయిల్ దుశ్చర్యలను వారు నిరసించారు. కెనింగ్స్టన్లోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయానికి భారీ మార్చ్ నిర్వహించారు. 'గాజాపై బాంబు దాడులను ఆపాలి', 'పాలస్తీనాకు విముక్తి కల్పించాలి', 'ఉగ్రవాద దేశంగా ఇజ్రాయిల్‌ను ప్రకటించాలి' అన్న డిమాండ్లు మార్మోగాయి. ఈ సందర్భంగా ర్యాలీలనుద్దేశించి మాట్లాడిన వక్తలు అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను బాహాటంగా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయిల్ చర్యలను ఖండించారు. మానవ హక్కుల విషయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను వారు విమర్శించారు. గాజాలో రక్తపాతాన్ని నివారించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాను అక్రమించడమే ప్రస్తుత సంక్షోభానికి మూల కారణమని అన్నారు. రెండు దేశాల ఏర్పాటు ప్రాతిపదికన ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించాలని కోరారు.-